టాలీవుడ్ దిగ్దర్శకుడు రాజమౌళి బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో చాలా వింతలు విశేషాలు జరుగుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్ లు కీలక రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ అత్యద్భుతంగా దర్శనమివ్వనున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. మహేశ్‌బాబు, అమితాబ్‌బచ్చన్ ‘ఆర్ఆర్ఆర్’ టీంలో చేరుతున్నారని విపరీతంగా టాక్ నడుస్తోంది. కాకపోతే వాళ్లు కనిపించరని.. వినిపించనున్నారని తెలుస్తోంది. టాలీవుడ్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగు వెర్షన్‌కు మహేశ్, హిందీ వెర్షన్‌కు అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. ఇందుకు సంబంధించి రాజమౌళి.. అమితాబ్, మహేశ్ బాబుతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ‘ఆర్ఆర్ఆర్’ తమిళం, మలయాళ వెర్షన్లకు ఏ హీరోలతో వాయిస్ ఓవర్ ఇప్పించాలనే విషయంలో రాజమౌళి ఇంకా నిర్ణయానికి రాలేదని.. అక్కడ కూడా టాప్ హీరోలతోనే ఉంటుందనేది టాప్ సీక్రెట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ విషయాలు అధికారికంగా ఎప్పుడు ప్రకటన వెలువడుతుందో చూడాలి.
కాగా సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ తారలు సందడి చేయనున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్.. రామ్‌చరణ్‌కు జంటగా కనిపించనున్నారు. అలాగే హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ ఎన్టీఆర్ పక్కన సందడి చేయనున్నారు. వీరితోపాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, రాయ్ స్టీవెన్సన్, ఎలిసిన్ డ్యూడీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Recent Comments