ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా చురుకుగా పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్లలో చేయలేని పనులను.. బిల్లులను ఎంతో సమర్థవంతగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకొని ఆ దిశగా వైఎస్ జగన్ చాలా విలక్షణంగా పాలన సాగిస్తున్నారు. జెట్ స్పీడ్ లో పాలన చేస్తూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే ఎన్నో సాహసోపేతమైన బిల్లులను తెచ్చారు. ఎన్నో పాలసీలను రూపొందించారు. ఐదేళ్లు తమకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వరంగా భావించి ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి వసూలు చేసిన సంపదను ప్రజలకు సమానంగా పంచాలని వికేంద్రీకరణ దిశగా అడుగులు వేశారు. అందుకోసం అడ్డు వచ్చిన శాసన మండలిని రద్దు చేసి పార్లమెంట్ కు బిల్లును పంపారు.

అయితే ఇప్పుడు చెప్పవచ్చేది ఏమిటంటే.. ఏపీ అసెంబ్లీలో చేసిన శాసనమండలి రద్దు తీర్మానం బంతి కేంద్రం చేతిలో ఉంది. ఈ బిల్లును తప్పకుండా కేంద్రం ఓకే చేసి పంపుతుందన్న ఆశాభావాన్ని ఇప్పటికే పలువురు ఏపీకి చెందిన బీజేపీ నేతలు వెల్లడించారు కూడా. సుపరిపాలన దిశగా వైఎస్ జగన్ అడుగులు వేస్తే అందులో కేంద్రప్రభుత్వం ఏపీకి అన్ని విధాలా సహకరిస్తుందని.. ఆ విషయంలో ఏమాత్రం అడ్డు చెప్పదని కూడా బీజేపీ కేంద్ర నేతలు వెల్లడిస్తున్నారు. శాసనమండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని చెప్తున్నారు. శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పే అవకాశం ఎంతమాత్రం లేదని వివరిస్తున్నారు. అంతేకాకుండా మండలి రద్దు విషయం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి ఎంతమాత్రం లేదని కూడా బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

అందుకు మరో కీలకమైన విషయం కూడా ఇక్కడ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేమంటే.. రాష్ట్రాలలో ఎన్డీఏ బలం మెల్లిమెల్లిగా సన్నగిల్లుతుండటంతో బీజేపీతో అనుకూలంగా వ్యవహరిస్తూ.. తమ భావాలను పలు సందర్భాల్లో బహిరంగంగా సమర్థిస్తున్న ఏపీలోని అధికార వైసీపీతో కేంద్రప్రభుత్వం ఎంతమాత్రం వైరాన్ని పెట్టుకోదని కూడా చెప్తున్నారు. అలాగే.. అంతేకాకుండా ఏపీలో అసెంబ్లీలో వైసీపీ బలం ఎక్కువగా ఉంది.. దీంతో ప్రతి బిల్లు ఇక్కడ ఆమోదం పొందుతుంది. అలాగే శాసన మండలిలో వైసీపీకి తక్కువ సభ్యులు ఉండటంతో అక్కడ అడ్డుతగిలేందుకు ప్రతిపక్ష టీడీపీ వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఇదే సమస్య కేంద్రంలో మోడీకి కూడా ఎదురౌతుంది. అదేమంటే.. పార్లమెంట్ లో ఎన్డీఏకు బలంగా ఎక్కువగా ఉంది. రాజ్యసభలో మాత్రం తక్కువగా ఉంది.. దాంతో పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లులు రాజ్యసభలో తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఇప్పుడు అంతా ఇక్కడ జగన్ సమస్యే అక్కడ మోడీ ఎదుర్కొంటున్నారని.. దీంతో జగన్ పాలనను గౌరవించి శాసనమండలి రద్దు తీర్మానానికి మోడీ త్వరగానే ఆమోదం తెలుపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థకు లోబడే నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప అందుకు విరుద్దంగా వ్యవహరించదని వివరించారు. ఇంకా 169 (1) ప్రకారం అసెంబ్లీ.. తీర్మానం చేస్తే దాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లాలి తప్ప వ్యతిరేకించదని సర్వత్రా టాక్ నడుస్తోంది.