అమరావతి భూముల కొనుగోలు విషయంలో సీఐడీ దూకుడు పెంచింది. జెట్ స్పీడ్ తో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం ఇక్కడే వస్తుందని తెలిసి తెల్లరేషన్ కార్డు దారుల పేరుతో భూములు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలపై సీఐడీ విచారిస్తోంది. ఈరోజు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసింది. వారిలో తెల్లరేషన్ కార్డుదారులైన అబ్దుల్ జమేదార్, కొండలరావు పొలినేని, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహరావు, భూక్యా నాగమణి సహా మరొకరిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇంకా వీరు కాకుండా 791 మంది తెల్లరేషన్ కార్డుదారుల పేరుతో వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారని సీఐడీ ఆధారాలు సేకరించింది.

అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాంతంలో దళితుల నుంచి మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, పీ.నారాయణ బలవంతంగా భూములు కొనుగోలు చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. దళిత మహిళల నుంచి భూములు కొనుగోలు చేశారని ఎఫ్ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. అయితే వారు ఇష్టంతో కాకుండా బలవంతంగా భూములు కొనుగోలు చేశారని వివరించింది.

అంతేకాకుండా మాజీ మంత్రులు పుల్లారావు, నారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారిద్దరూ నేరపరమైన కుట్ర చేసి వారిని మోసం చేసి భూములు కొనగోలు చేశారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర సెక్షన్ల క్రింద కేసులు పైల్ చేశారు. అలాగే.. ల్యాండ్ పూలింగ్ పై సీఐడీ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

అంతటితో ఆగకుండా రాజధాని ప్రాంతంలో 796 తెల్లరేషన్ కార్డులు ఎకరం రూ.3 కోట్లు పెట్టి భూమి ఎలా కొనుగోలు చేశారని సీఐడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తన్నారు. రాజధాని ప్రాంతంలో తెల్లరేషన్ కార్డుదారులు కొనుగోలు చేసిన భూముల విలువ రూ.300 కోట్లపై మాటే అని సీఐడీ గుర్తించింది.. ఈ దెబ్బతో టీడీపీకి చెందిన నాయకులు.. బడా నేతలు.. మాజీ మంత్రులు.. బిజినెస్ క్యాడర్ కు చమటలు పడుతున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వం రాజధాని పేరుతో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపెట్టి ప్రజలందరికీ తెలియజేస్తుంది జగన్ సర్కార్. ఇందులో భాగంగా గట్టి చర్యలు కూడా తీసుకొనేందుకు మొగ్గు చూపుతుంది వైసీపీ ప్రభుత్వం.