ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఇదే సమయంలో పరిపాలనా పరంగా.. ఆర్థికంగా.. సంక్షేమం.. అభివృద్ధి పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహంతో ముందుకు వెళ్తుంది. వైఎస్ జగన్ సర్కార్ ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చాలా వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. ఆ పార్టీవైపు పలు పార్టీ నేతలు కూడా ఆకర్శితులౌతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో నగరంలో నాలుగు చోట్ల గెలిచి మిగిలిన చోట్లా ఓడిపోయి ఘరో పరాజయాన్ని ఎదుర్కొంది.

అయితే ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం టీడీపీని మరింత పాతాళానికి తోసింది. వైసిపి సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని.. టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే వైజాగ్ లోని స్థానిక నేతలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దీంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీడీపీలో గందరగోళం నెలకొంది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అది అమరావతి మాత్రమే అని టిడిపి అధినేతతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులంతా బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు. కానీ.. విశాఖ జిల్లాలో నాయకులు మాత్రం విశాఖకూ మద్దతిస్తున్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులు చేస్తున్న ఆందోళనలపై చర్చించుకుంటున్నారు తప్ప బహిరంగంగా అమరావతి రాజధానిగా ఉండాలని సమర్థించటానికి ముందుకు రావడంలేదు. అలాగే.. ఆ అమరావతి నిర్ణయాన్ని సమర్థిస్తే ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారని అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. మూడు రాజధానులను సమర్థిస్తే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అవుతుంది అనేది పార్టీ నేతలను గందరగోళానికి దారితీస్తుంది. దీంతో టిడిపి నేతల పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యిలా తయారైంది.

అదేవిధంగా ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు దిమ్మతిరిగేలా చేసింది. ముఖ్యంగా ఈ 3 రాజధానులపై ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా 151 మంది వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అందుకు ప్రతిగా వైసీపీ నేతలు కౌంటర్ వేశారు. ముందు విశాఖకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. అధికార పక్షంపై కొంత కాలం పోరాడిన ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు రాజధాని అంశంలో మాత్రం మౌనంగా ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది.

అందులో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని గంటా స్వాగతించారు. ముఖ్యంగా విశాఖ నగరం చుట్టు పక్కల మండలాలకే పరిమితమైన అభివృద్ధి.. పరిపాలన రాజధాని ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని టీడీపీ నేతలు గొంతులు పెంచుతున్నారు. ఆ తర్వాత స్వాగతిస్తూ తీర్మానం చేశారు.. కానీ అప్పటి నుంచి గంటా కనబడటం లేదు. కనీసం రాజధాని కావాలని కూడా అనడం లేదు. గంటానే అడ్రస్ లేకుండా పోవడంతో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ అయిపోయారు. మరో పక్క అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాత్రం అమరావతి రాజధాని కావాలని నినదించారు. దీంతో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం విశాఖ వైసిపి నేతలు భగ్గుమన్నారు. దిష్టిబొమ్మ దహనం చేసి వెలగపూడి విజయవాడ వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద రాజధానిపై టిడిపి నేతలు ఏ కామెంట్ చేసినా దానిని అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు వైసీపీ విరుచుకు పడుతుంది. ఇప్పుడు వెలగపూడి మినహా గణబాబు, గంటా, వాసుపల్లి మాత్రం మౌనంగానే ఉండిపోవడంతో వీరు వైసీపీ వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. మొత్తానికి వైఎస్ జగన్ పరిపాలన టీడీపీని ఓ కుదుపు కుదుపుతుంది. వైజాగ్ మాత్రమే కాకుండా ఉత్తరాంధ్రలోని టీడీపీ నేతలకు చెమటలు పుట్టిస్తోంది. ఈ దెబ్బతో ఉత్తరాంధ్ర మొత్తం వైసీపీకి దాసోహం కావడం షురూ అంటోంది టీడీపీ కేడర్ కూడా. మరి అదన్నమాట వైఎస్ జగన్ వ్యూహమంటే అంటోంది వైసీపీ కేడర్.