ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి వ్యవహారం రోజురోజుకూ రచ్చగా మారుతుంది. సెలక్ట్ కమిటీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నట్లుంది టీడీపీ నాయకులపైనా.. వారి అనుయాయులపైన ఐటీ రైడ్స్ జరుగుతుండటంతో వాటినుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకు టీడీపీ నేతలు శాసన మండలి సెలక్ట్ కమిటీని హాట్ టాపిక్ గా తెరపైకి తెస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులను శాసన మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించారు. అలాగే సెలక్ట్ కమిటీకి పేర్లు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శిని చైర్మన్ ఆదేశించారు. కానీ ఛైర్మన్ పంపిన ఫైలును మాత్రం కార్యదర్శి పట్టించుకోకుండా వెనక్కి పంపించారు. దీనిపై మండలి చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మండలి చైర్మన్ 48 గంటల గడువు ఇచ్చారు. అయినా కార్యదర్శి పట్టించుకోకుండా తిరిగి రెండోసారి కూడా ఫైలును వెనక్కి పంపించారు. చైర్మన్ ఇచ్చిన 48 గంటల గడువు ముగియడంతో సెలక్ట్ కమిటీల నోటిఫికేషన్ ఇవ్వలేనని కార్యదర్శి ఫైలును తిరిగి వెనక్కి పంపించేశారు.

అంతేకాకుండా క్లాజ్ 189ఎ ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సెలక్ట్ కమిటీ దస్త్రాన్ని కార్యదర్శి రెండోసారీ వెనక్కి పంపడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై తదుపరి కార్యాచరణ ఏంటనే దానిపై పరిశీలిస్తోంది. అయితే సెలక్ట్ కమిటీ దస్త్రాన్ని కార్యదర్శి వెనక్కి పంపడం మాత్రం సభ నియమాల ఉల్లంఘన కిందకే వస్తుందని మండలి ప్రతి పక్షనేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. సభ్యులెవరైనా దీనిపై నోటీసు ఇవ్వొచ్చని ఆయన వెల్లడించారు. క్రమశిక్షణా చర్యల కింద కఠిన నిర్ణయం తీసుకునే అధికారం చైర్మన్ కు ఉందని తెలిపారు. సెలక్ట్ కమిటీ దస్త్రం మండలి కార్యదర్శి తిప్పి పంపడం మరోసారి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దానికి తెరలేపింది.

అంతేకాకుండా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు టీడీపీ తీవ్రంగా కృషి చేస్తుంది. ఇరుపక్షాలూ విమర్శలు ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మండలి కార్యదర్శి వ్యవహరించిన తీరుపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. చైర్మన్ నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదంటూ టిడిపి ఆరోపిస్తోంది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు మరోసారి ఈ రెండు బిల్లుల అంశం ఉభయ సభలను కుదిపేసే అవకాశాలు లేకపోలేదు. అయితే సమావేశాల సందర్భంగా మండలి కార్యదర్శిపై టీడిపీ సభ్యుల నోటీస్ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు న్యాయపరంగా కూడా ముందుకు వెళ్ళాలని టిడిపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హైకోర్టును ఆశ్రయించాలని ఉన్నట్లు సమాచారం. ఇప్పడు సెలెక్ట్ కమిటీ రగడ బడ్జెట్ సమావేశాల్లోనూ కొనసాగే అవకాశముంది. చూద్దాం ఇదివరకు వెళ్తుంది అనేది. అయితే ఈలోపే అన్నిరకాలుగా కేంద్రం నుంచి క్లియరెన్స్ తెచ్చుకొనే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. మరిప్పుడు ఇది కేంద్రం చేతిలో ఉండటంతో అసలు శాసనమండలి రద్దు చేస్తే ఇక టీడీపీ ఎత్తులు అసలే ఉండవని అధికార వైసీపీ భావిస్తుంది. మొత్తానికి ఏపీలో శాసన మండలి ఫైట్ నడుస్తోందనే చెప్పాలి. దీనికి త్వరలోనే సీఎం వైఎస్ జగన్ పరిష్కారం కూడా తెల్పి తేల్చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.