ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే కాకుండా వైజాగ్, కర్నూల్ నగరాలను కూడా రాజధాని కేంద్రాలుగా నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్. అయితే ఈ విషయంలో శాసనమండలి రద్దు, హైకోర్ట్ కేసులు వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ సర్కార్ కు తాజాగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అదేమంటే… రాష్ట్రప్రభుత్వాలకు ఎక్కడ రాజధానులు ఉండాలి అనే అంశాలపై ఆయా రాష్ట్రాలకు మాత్రమే నిర్ణయాధికారం ఉంటుందని కేంద్రం తెలిపింది. దీంతో 3రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష టీడీపీకి షాక్ ఇచ్చినట్లు అయింది. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని… వికేంద్రీకరణతో కూడిన పాలన జరగకూడదని.. అలా జరిగితే అమరావతిలో అభివృద్ధి ఆగిపోయి తమకు అంటే స్వలాభం పోతుందని వారి ఆలోచనలకు దెబ్బపడినట్లు అయింది.

అయితే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ దిశగా వైసీపీ సర్కార్ చాలా వేగంగా అడుగులు వేస్తుంది. అయితే ఏపీ శాసన మండలిలో బ్రేక్‌లు పడటంతో… ఇప్పుడు ఏపీ రాజధానుల వ్యవహారం కాస్త.. లోక్‌సభను తాకింది. రాజధానుల వ్యవహారంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్.. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆ రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిపారు. ఇంకా.. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు. గత ప్రభుత్వ జీవో ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతి ఉందని తెలిపారు. కాగా.. ఏపీకి మూడు రాజధానులను రూపొందించుకొనేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తూ మీడియా నివేదికలు వచ్చాయని.. లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ స్పష్టత ఇవ్వడం ఇప్పుడు ఏపీలో సంచనల అంశంగా మారింది.

అదేవిధంగా రాజధానిపై రాష్ట్రాల నిర్ణయమే ఫైనల్ అని.. ఇందులో కేంద్రం కలుగజేసుకొనేది ఏం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేశారని గుర్తు చేశారు. అయితే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా రిపోర్టుల్లో చూడటమే గాని.. ఇంకా తమ వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని వివరించారు. అయితే రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని.. అది ఆయా రాష్ట్రాల అంతర్గత వ్యవహారమని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ప్రకటనలతో జగన్ సర్కార్‌కు పెద్ద ఊరట లభించినట్లయింది. మరి వైఎస్ జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్ అందడంతో వైజాగ్, కర్నూల్ ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.