ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ సారి జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. త్వరలో జరగబోయే జడ్పీ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని వైసీపీలోని కొందరు పెద్దలు కర్చీప్ వేసుకొని కూర్చుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం వరుసగా ఈసారి కూడా జనరల్ కావడంతో పీఠాన్ని కైవసం చేసుకొనేది ఎవరనే దానిపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ చివరి నిమిషంలో కొందరు అసెంబ్లీ ఇన్ చార్జులను మార్చడం.. టిక్కెట్ల కోసం నెలకొన్న తీవ్ర పోటీతో అధినేత జగన్ టికెట్ దక్కని వారికి హామీలిచ్చారు. వైసిపి అధికారంలోకి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాని వారికి జడ్పీ చైర్మన్ లేదా ఎమ్మెల్సీలుగా అవకాశాలు కల్పిస్తాను అని చెప్పారు. దీంతో ఇప్పుడు జడ్పీ పీఠం కోసం ఆ పార్టీలో పోటీ తీవ్రమైంది అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించినవారిలో బూచేపల్లి శివప్రసాదరెడ్డి, రావి రామనాథం బాబు, గొట్టిపాటి భరత్, జంకె వెంకటరెడ్డి, తూమాటి మాధవ రావు వంటి వారు ఉన్నారు. కానీ రామనాథం బాబును దగ్గుబాటి వెంకటేశ్వర రావు స్థానంలో పరుచూరు ఇన్ చార్జిగా నియమించడంతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ గా కూడా నియమించారు. దీంతో ఆయన రేసులో లేనట్లే అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

అయితే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జంకె వెంకటరెడ్డి తన స్థానాన్ని కే.నాగార్జునరెడ్డికి త్యాగం చేశారని సానుభూతి ఉంది. 2001లో టిడిపిలో ఉన్నప్పుడు జడ్పీ పీఠాన్ని ఆశించారు కానీ అప్పుడు పుల్లలచెరువు జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టిడిపిని వీడారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన జంకే ఇప్పుడు జడ్పీ పీఠంపై ఆసక్తి చూపించడంలేదు అంటున్నారు. కందుకూరు టికెట్ ఆశించిన తూమాటి మాధవరావు వ్యాపారం రీత్యా బిజీగా ఉండటం… గొట్టిపాటి భరత్ అంత యాక్టివ్ గా లేకపోవడంతో ఇప్పుడు జిల్లా పరిషత్తు చైర్మన్ రేసులో దర్శి మాజీ శాసన సభ్యుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.

అదేవిధంగా.. సీఎం జగన్ స్వయంగా కూడా బూచేపల్లిని రంగంలోకి దింపేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బూచేపల్లి మొదట ఎమ్మెల్సీ ఆశించిన మండలి రద్దయ్యే అవకాశాలు ఉండడంతో జడ్పీ చైర్మన్ గిరీకి ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఆయనకు పార్టీ పరంగానూ కార్యకర్తల్లో మంచి పట్టు ఉంది. ఇక ఆయన పేరు అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్నట్లు ఉంది అక్కడ వ్యవహారం.

అంతేకాకుండా జిల్లాలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి గతం కంటే చాలా భిన్నంగా తయారైంది. ఈ మధ్య ఎన్నికల్లో ఊహించని పరాభవంతో పార్టీ నాయకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో ఓ పక్క ఐటీరైడ్స్. గతంలో పార్టీకీ ఆర్థికంగా అండగా ఉన్న శిద్దా రాఘవరావు, దామచర్ల జనార్థన్, కరణం బలరాం పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ క్వారీలపై వరుస దాడుల నేపథ్యంలో ఆయన వైసిపి వైపు చూస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. దీంతో టిడిపి నుంచి ఆర్థికంగా బలమైన ఓసీ అభ్యర్థులు ఎవరూ పోటీకి ముందుకు రావడం లేదని అంటున్నారు. అయితే జిల్లా పరిస్థితులను ముందుగానే పసిగట్టిన టిడిపి అధిష్టానం చంద్రబాబు ఆదేశాలతో ఇక తప్పని పరిస్థితుల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆ పార్టీ తరపున జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కట్ట శివయ్య పేరును తెరపైకి తెచ్చారు. సంతనూతలపాడు మండలానికి చెందిన శివయ్య బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నియోజక వర్గ స్థాయి నేత. ఆర్థికంగా కొంత పర్వాలేదు అనిపించినా జెడ్పీ చైర్మన్ కోసం పోటీ పడగలిగేంత స్థాయి ఆయనకు లేదనే చెప్పాలి. ఇంకా గతంలో వైసిపిలో ఉండి ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన వారికి పదవులు ఎలా ఇస్తారని టీడీపీలోనివారే అడ్డు తగులుతున్నారు. దీంతో జిల్లాలో వైసీపీ.. టీడీపీల మధ్య ప్రధాన పోటీగా ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసిపి జిల్లా పరిషత్తు పీఠాన్ని కైవసం చేసుకుంటుందా? లేక టిడిపీ తన సత్తా ఏంటో చాటుతుందా? అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు జిల్లా వాసులు. ఏది ఏమైనప్పటికీ.. ఈసారి పరిషత్ లోని అన్నింటినీ కైవసం చేసుకొని చైర్మన్ గిరీలో తానే ఉండాలని అంటున్నారు బూచేపల్లి సుబ్బారెడ్డి. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.