ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కీలకంగా మారాయి. ఏపీలోని 3రాజధానులపై కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు వాకబు చేస్తుంది. దీంతో వైఎస్ జగన్ తీసుకున్న విధానపరమైన వైఖరి.. నిర్ణయాలను అందులోని నిజానిజాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది కేంద్రం.అమరావతి రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కేంద్రం పూర్తిగా గ్రహించినట్లుగానే తెలుస్తోంది. అందులో భాగంగానే వైఎస్ జగన్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు కష్టంగా అనిపించినా సమర్థించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి సమయంలో రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని పక్షాలు జెఎసితో కలిసి పోరాటం చేస్తుంటే కొన్ని విడిగానే పర్యటనలు, ప్రకటనలతో తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. త్రీ క్యాపిటల్స్ వ్యతిరేక ఉద్యమంలో జేఏసీతో కలిసి టిడిపి బీభత్సంగా పోరాడుతుంది. సిపిఐ కూడా వారితోనే కలిసి చల్లగా చెల్లుకింద నీడలా సాగుతోంది. అయితే పాలనపరమైన విభజనను సిపిఎం వ్యతిరేకిస్తున్నా.. వీరితో కలిసి సాగడం లేదు. ఇక కొత్త స్నేహాలు మొదలు పెట్టిన బిజెపి – జనసేన కూడా రాజధానిని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ.. విచిత్రంగా వికేంద్రీకరణ జరగాలనీ.. హైకోర్ట్ కర్నూలులో ఏర్పాటు చేయాలని చడీ చప్పుడు లేకుండా చెప్తున్నాయి. అయితే అది అందరికీ తెలుసనుకోండి.

ఇదే విషయంపై కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్‌ విడివిడిగా ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతులకు తమ మద్దతు కూడా తెలిపారు. ఈ రెండు పార్టీలు కలిసి సాగే విషయంలో ఉమ్మడి ప్రకటన చేశాయి. ఆ తర్వాత పవన్.. ఢిల్లీ వెళ్లడం… అక్కడ పెద్దలను కలవడం వంటివి జరిగాయి. అదే సమయంలో ఫిబ్రవరి 2వ తేదీన రాజధాని కోసం రెండు పార్టీలు లాంగ్ మార్చ్ కూడా ప్రకటించారు. అయితే అది హఠాత్తుగా..రద్దయ్యింది. రాజధాని విషయంలో అంతా కేంద్రం వైపు, బిజెపి వైపు చూస్తున్న సమయంలో ఈ రెండు పక్షాలు అనూహ్యంగా సైలెంట్ అయ్యాయి. దీంతో అసలు బిజెపి – జనసేన వ్యూహం ఏంటి… అనేది ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతుంది. రాజధానిపై ప్రత్యక్ష పోరాటం చేస్తారా…? ప్రకటనలతో సరిపెడతారా? అనేది చర్చగా మారింది. ఢిల్లీకి తెలిసే అంతా జరుగుతుంది అనే ప్రచారాన్ని రెండు పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి…కానీ.. అదే విషయాన్ని బలంగా చెప్పలేక మింగలేక.. కక్కలేక ఉన్నాయి. అసలు కొంతమంది బీజేపీ నేతలైతే ఈ విషయాన్ని ఎంత త్వరగా తేల్చితే అంత మంచిది అనే విధంగానే ఉన్నారు.

అంతేకాకుండా బీజేపీ, జనసేన రెండు పార్టీలు చెప్పినట్లు అమారవతి విషయంలో ప్రత్యక్ష పోరాటం మొదలు పెట్టలేదు. రైతుల పోరాటం జరగుతున్నా… గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నా జనసేన- బిజెపి ఏం చేస్తాయి అనేది తేలడం లేదు. డిల్లీ పర్యటన తరువాత క్షేత్ర స్థాయి పోరాటం అని చెప్పిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాయి. మూడు రాజధానులు సరైన నిర్ణయం కాదని కన్నా సిఎం జగన్ కు లేఖ రాశారు. అలాగే.. మూడు రోజుల క్రితం జరిగిన రెండు పార్టీల ముఖ్యనేతల సమావేశంలో కూడా అమరావతి పోరాటంపై చర్చ జరగలేదని తెలుస్తోంది. ఈ రెండు పక్షాల మౌనానికి కారణం ఏంటి…? జాతీయ పార్టీ నుంచి ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గమని డైరెక్షన్ వచ్చిందా…? లేఖ వ్యూహంలో భాగంగానే సైలెంగా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి.. ఇప్పుడు ఈ రెండు పార్టీల విషయంలో చూసుకుంటే.. రెండు కలిసి అమరావతి విషయంలో వేగం తగ్గించడం వెనుక ఢిల్లీ డైరెక్షనే కారణంగా తెలుస్తోంది. ప్రత్యక్ష పోరాటంపై వెనక్కి తగ్గడం వెనుక బలమైన కారణం కేంద్రం నుంచి డైరెక్షనే అని సర్వత్రా టాక్ వినిపిస్తోంది.. మరి వేచి చూడాలి.