ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని సీరియస్ గా హెచ్చరించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు వైఎస్ జగన్. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని జోక్యం అవసరముందని.. లేకపోతే ఏపీ ప్రజలు దురదృష్టవంతులుగా మిగిలిపోతారని జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సరైన న్యాయం జరుగకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. ఏపీకి చేయూతను అందించేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదని లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్. అలాగే.. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఏపీకి ఐదేళ్లపాటూ ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. అయినాగానీ.. ఇప్పటివరకు ప్రత్యేక హోదా రాకపోవడంతో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వెల్లడించారు.

అదేవిధంగా పద్నాలుగో ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకిచ్చే ప్రత్యేక హోదాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం 2016లో ప్రకటించిందని.. కానీ.. 15వ ఆర్ధిక సంఘం మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నదన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు జగన్. అలాగే.. ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవడమనేది తమ పరిధి కాదని 15వ ఆర్ధిక సంఘం స్పష్టంగా చెప్పిందని కూడా లేఖలో జగన్ వెల్లడించారు. దీన్ని బట్టి కేంద్ర ఆర్ధిక శాఖకు, 15వ ఆర్ధిక సంఘానికి ప్రత్యేక హోదా విషయంలో వేర్వేరు అభిప్రాయాలున్నట్లు కనిపిస్తోందని కూడా లేఖలో జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో విభజన తర్వాత ఏపీ ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. విభజన జరిపిన తీరు వల్ల తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ లబ్ది పొందిందని.. ఏపీకి కేంద్రం నుంచి సరైన సాయం అందలేదని లేఖలో ప్రస్తావించారు వైఎస్ జగన్.

అయితే ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయంగా బీజేపీ ఎంపీ ఈ మధ్య పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్.. ప్రధాని మోడీకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్న నేపథ్యంలో.. కేంద్రం ఆర్థిక సంఘం పరిధిలోని అంశమని చెబుతోంది. కానీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం కేంద్రం పరిధిలో ఉందని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని లేఖలో ప్రస్తావించి మోడీకి గుర్తు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. చొరవ తీసుకొని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని ప్రధానిని కోరారు. ఈ లేఖను సీఎంవో కాసేపటి క్రితం మీడియాకు విడుదల చేసింది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తగిన స్థాయిలో కేటాయింపులు లేవని.. ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని కూడా లేఖలో వివరించారు వైఎస్ జగన్. ఈ విషయాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఏపీకి తగిన న్యాయం చేయాలని ప్రధాని మోడీకి సీరియస్ గా డిమాండ్ చేశారు ఏపీ సీఎం వైస్ జగన్.