కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో 2020 కి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కు సంబంధించి అనేక విషయాలపై ఆమె సుదీర్ఘంగా ప్రస్తావించారు. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి మొదటి ప్రాధానిత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆరోగ్యం, ప్రారిశుధ్యం, తాగునీరుకు రెండో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. విద్య, చిన్నారుల సంక్షేమానికి మూడో ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే విధంగా గ్రామీణ సడక్ యోజన ద్వారా ఆర్ధిక సమ్మిళిత విధానాలను మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తునట్టు ఆమె తెలిపారు.

అదేవిధంగా అందరికి ఆవాసం కల్పించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. న్యూఇండియా సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, ప్రజా సంక్షేమం.. అనే మూడు లక్ష్యాలతో ముందుకు నడుస్తున్నట్టు ఆమె తెలిపారు. అలానే ప్రపంచంలోనే ఐదో బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇంకా సంపదను సృష్టించడమే లక్ష్యంగా, వ్యవసాయరంగం అభివృద్ధికి 16సూత్రాల పథకం అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు.

రైతుల ఆదాయం పెంపునకు కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. 2022 కల్లా వీరి ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేవలం లక్ష్యాలను నిర్దేశించుకోవడం మాత్రమే కాకుండా.. వాటి సాకారానికి అవసరమైన నిర్ణయాలు కూడా ప్రకటించారు.

అదేవిధంగా దేశ వ్యాప్తంగా కరువు జిల్లాల్లోని రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆధునిక వ్యవసాయానికి ప్రోతాహం అందిస్తామని.. అలాగే.. 20 లక్షల మంది రైతులకు పంప్ సెట్లు అందిస్తామని అన్నారు. ఇక ఇప్పటికే 6 కోట్లకు పైగా రైతులకు బీమా అందిస్తున్నామని వివరించారు. ఇంకా భారత్‌లో నీటి లభ్యత లేని 100 జిల్లాలను గుర్తించామని, వీటి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయించామని.. నాబార్డు స్కీమ్ రైతులకు పొడిగిస్తామని వివరించారు.

అంతేకాకుండా రైతుల కోసం కృషిలో భాగంగా ఉడాన్ పథకం తీసుకువస్తామని… కిసాన్ క్రెడిట్ పేరుతో మరిన్ని రుణాలు అందజేస్తామని సీతారామన్ తెలిపారు. గోదాముల నిర్వహణను స్వయం సహాయక గ్రూప్‌లకు అప్పగిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గోదాముల నిర్మాణానికి రుణాలు అందజేస్తామని తెలిపారు. కౌలు భూములకు కొత్త చట్టం ఆవిష్కరిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో కృషి ఉడాన్‌ను ప్రారంభిస్తామని, రైతుల కోసం కిసాన్ రైలును ప్రారంభించనున్నట్టు నిర్మలా సీతారామన్ వివరించారు. దీంతో మొత్తానికి ఏపీలోని కొన్ని జిల్లాల రైతులకు మేలు చేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.