ఆమె మాట్లాడితే చాలు ముత్యాలు జాలువారినట్లుంటుంది. స్వచ్ఛమైన ఆమె నవ్వితే చాలు అక్కడ వెలుగు విరబూస్తుంది. అస్సలు ఆమె చూపు తగిలితే చాలు అక్కడ వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది. ఆమే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి. గిరిజన పుత్రిక. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాముల నారాయణ మూర్తి, గౌరీ పార్వతి దంపతుల రెండవ కుమార్తె పాముల పుష్ప శ్రీవాణి. ఈమెకు పెద్ద అక్క తులసి, చెల్లెలు సృజన, తమ్ముడు పృధ్వీరాజ్ ఉన్నారు. వీరితో కలిపి మొత్తం నలుగురు సంతానం. అయితే పుష్ప శ్రీవాణి 1986 జూన్ 22వ తేదీన జన్మించారు.

అయితే పుష్పశ్రీవాణి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు దొరమామిడిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ డిగ్రీలను జంగారెడ్డి గూడెంలోని సూర్య కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత విశాఖపట్టణంలో బీఈడీ పూర్తి చేసి.. గిరిజన సంక్షేమ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ గా పనిచేశారు. తండ్రి నారాయణ మూర్తి కూడా పోలవరం మండలంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ లో వంటకుక్ గా ఉద్యోగంలో చేరి తర్వాత ఉపాద్యాయుడుగా పదోన్నతి పొంది ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఆయన బాటలోనే కూతుళ్లు నడిచారు. అక్క తులసి కూడా టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే చదువు పూర్తైన తర్వాత కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ గా చేరిన పుష్పశ్రీవాణి జీవితం ఊహించని రీతిలో మలుపు తిరిగింది.

తండ్రి నారాయణ మూర్తి తన ఆడపిల్లలను విజయనగరం జిల్లాకు ఇచ్చారు. ఇదే పుష్పశ్రీవాణికి అనుకోని వరంగా మారింది. రాజుల కుటుంబంలోకి అడుగు పెట్టడానికి కారణమైంది. పుష్పశ్రీవాణిని కోడలుగా చేసుకుంది శతృచర్ల చంద్రశేఖర రాజు. విజయనగరం జిల్లా ప్రముఖ రాజకీయ నేతల్లో ఒకరైన శతృచర్ల విజయరామరాజు సోదరుడే శతృచర్ల చంద్రశేఖర్ రాజు. ఈయన కూడా గతంలో అంటే 1989లోనే ఎమ్మెల్యేగా నగరులో పని చేశారు. ఈ నియోజక వర్గంలో మొత్తం ఐదుసార్లు శతృచర్ల కుటుంబం విజయం సాధించింది. నాలుగు సార్లు విజయరామరాజు గెలుపొందగా.. ఒక్కసారి చంద్రశేఖర్ రాజు విజయాన్ని సాధించి తమ కుటుంబం సత్తాను చాటారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో శతృచర్ల కుటుంబం ఎస్టీలు కాదన్న వాస్తవం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సందిగ్ధ అవస్తలో ఉండగా.. 2009లో నగరు నియోజక వర్గం కాస్తా కురుపాంలో భాగమైంది. దీంతో తమ కుటుంబం ఎలాగైనా రాజకీయంగా పట్టు సాధించాలని.. ప్రజల్లో తమ పలుకుబడి కోల్పోకూడదని భావించిన శతృచర్ల కుటుంబం తన మేనల్లుడైన జనార్దన్ దాట్రాజును నిలబెట్టి గెలిపించుకుంది.

అయితే ఇక్కడే మరో షాకింగ్ మలుపు చోటుచేసుకుంది. జనార్ధన్ దాట్రాజుకు చంద్రశేఖర్ రాజుతో విబేధాలు పొడసూపాయి. దాంతో మేనల్లుడైనా బయటవాడేనని.. తమ కుటుంబంలోని వాడే రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని భావించాడు. దీంతో ఆలోచించి.. ఎస్టీ మహిళను తమ కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తే.. ఆమెను ఎన్నికల బరిలో దింపవచ్చని ప్లాన్ వేశారు చంద్రశేఖర్ రాజు.

అది కాసేపు అలా ఉంచితే.. ఇక పుష్పశ్రీవాణి కుటుంబం గురించి తెలుసుకుందాం. నారాయణ మూర్తి పెద్ద కుమార్తెకు విజయనగరం అబ్బాయితో పెళ్లి అయింది. అక్కను చూసేందుకు విజయనగరం వెళ్తోన్న పుష్పశ్రీవాణి అనుకోకుండా శతృచర్ల కుటుంబం కంట పడింది. అప్పటికే ఎస్టీ అమ్మాయి కోసం వెతుకుతోన్న శతృచర్ల కుటుంబానికి ఊహించని విధంగా పుష్ప శ్రీవాణి వారి కంటపడింది. ఎంతో మురిసిపోయారు. వెంటనే పుష్పశ్రీవాణి అక్కతో, మిగతా కుటుంబ సభ్యులతో శతృచర్ల కుటుంబం మాట్లాడి బంధాన్ని కులుపుకున్నారు. అయితే ఇక్కడ పుష్పశ్రీవాణి శతృచర్ల కుటుంబానికి ఓ కండిషన్ పెట్టింది. అదేమంటే.. మీరు వైఎస్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీకి చెందినవారే. అలా అయితేనే తాను ఈ సంబంధాన్ని ఒప్పుకుంటాను.. లేకపోతే కష్టం. ఎందుకంటే.. తాను వైఎస్ కుటుంబానికి వీరాభిమాని. అది ఎంతంటే.. వైఎస్ మరణం సమయంలో పుష్పశ్రీవాణి నాలుగు రోజుల పాటు పచ్చి మంచినీటిని కూడా ముట్టకుండా తీవ్రమైన ఆవేదనకు లోనైంది. అదన్నమాట పుష్పశ్రీవాణికి వైఎస్ కుటుంబంపై ఉన్న ప్రేమ.. భక్తి.. అభిమానం. ఇక వివాహం విషయానికి వస్తే.. తామూ వైఎస్ కుటుంబానికి అభిమానులమే అనడంతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెద్దల సమక్షంలో పాముల పుష్పశ్రీవాణి.. శతృచర్ల చంద్రశేఖర్ రాజు కుమారుడు పరీక్షిత్ రాజుతో 2014లో ఘనంగా వివాహం జరిగింది.

ఇక్కడో విషయం చెప్పాలి. అంతకుముందే కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు శతృచర్ల చంద్రశేఖరరాజు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా చంద్రశేఖర్ రాజుకు పేరుంది. వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత విజయనగరం జిల్లాలో మొదటగా ఆ పార్టీకి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది చంద్రశేఖర్ రాజే. దీంతో వైఎస్ జగన్ అప్పట్లోనే రాజుగారి కోరికమేరకు తమ కోడలు పుష్పశ్రీవాణికి ఎమ్మెల్యే సీటు కేటాయించారు. ఇక ఇక్కడ శతృచర్ల కుటుంబ బలంతో ఎమ్మెల్యేగా పుష్పశ్రీవాణి సునాయాసంగా విజయం సాధించింది. విచిత్రంగా ఆమె రాజుగారి మేనల్లుడు జనార్దన దాట్రాజు మీదనే విజయం అందుకోవడం విశేషంగా చెప్పవచ్చు. ఆ తర్వాత అదే ఇంట్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పుష్పశ్రీవాణి తన మాట వినడం లేదని.. సొంత మామ చంద్రశేఖర్ రాజు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అందుకు 2014లో వైఎస్ జగన్ పార్టీ అధికారంలోకి రాకపోవడమే కారణం. కానీ పుష్పశ్రీవాణి మొదటి నుంచి వైఎస్ జగన్ వెన్నంటి నడిచారు. సొంత మామ టీడీపీలో ఉన్నా.. పుష్రశ్రీవాణి మాత్రం వైసీపీలోనే ఉండి.. ప్రతిపక్షం తరఫున తమ గళాన్ని వినిపించి ప్రభుత్వంపై పోరాడారు. తాను జగన్ కోసం దేనికైనా సిద్ధమని.. జగన్ తోనే ఉంటానని చెప్పి అధినేత ఆదరణ చూరగొన్నారు. తర్వాత 2019లో కురుపాం సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని అందుకొని ఏపీ ఉపముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. గిరిజన్ శాఖా మంత్రిగా కూడా అధికారంలో దేదీప్యమానంగా దూసుకుపోతున్నారు. ఆమె మాటల తూటాలతో ప్రత్యర్థుల గుండెలను సూక్ష్మంగానే మందలిస్తూ నిద్రపట్టకుండా చేస్తున్నారు.

సాధారణ టీచర్ గా సాగిపోతున్న పుష్పశ్రీవాణి జీవితం ఊహించని మలుపులతో ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవిని అలంకరించేలా చేసింది. ఇది ఇలా ఉంటే పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని గిరిజన సంఘం ప్రశ్నిస్తుంది. ఆమె కుల వివాదం కోర్టు పరిదిలో ఉండగా.. ఎస్టీ కోటాలో ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా ఏకంగా గిరిజన సంక్షేమ శాఖను ఎలా కట్టపెడతారని విమర్శిస్తుంది. గతంలో పుష్పశ్రీవాణి సోదరి తులసి ప్రభుత్వం ఉపాధ్యాయురాలుగా ఎంపికైన తర్వాత ఆమె ఎస్టీ కాదని.. అప్పట్లో పార్వతీపురం ఐటీడీఓ పీవో విచారణ చేసి నిర్థారించగా ఆమె ఉద్యోగం కోల్పోయింది. అయితే పుష్పశ్రీవాణి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఎన్నో రకాలుగా మభ్యపెట్టి తమ పార్టీలోకి లాగేద్దామని చూసింది. కానీ.. నీతిగా నిజాయితీ అన్నింటినీ ఎదుర్కొని వైఎస్ జగన్ తోడుగా నడిచారు పుష్పశ్రీవాణి. ఎస్టీ విషయంపై పుష్పశ్రీవాణి మాటల్లో చెప్పాలంటే.. గతంలో చంద్రబాబు నాయుడు తనను ఎన్నో రకాలుగా వేధించాడని.. తాను ఎస్టీ కాకపోతే అప్పుడు చూస్తూ ఊరుకోరు కదా.. ఇప్పుడు మళ్లీ దాని గురించి ఎందుకు రచ్చ చేస్తున్నారని చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ బుట్టాయిగూడెం మండలంలోని దొరమామిడి అనే పల్లెటూరులో పుట్టిన పుష్పశ్రీవాణి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా.. మంత్రిగా ఎదగడం, అసెంబ్లీలో తమ గళాన్ని విప్పడం, ప్రజల మనసులను చూరగొనడం పట్ల రాష్ట్ర ప్రజలు మురిసిపోతున్నారు. ఇలాంటి ఓ యువనేత్రి వైఎస్ జగన్ వర్గంలో ఉండటం.. అంటే ఆ కేబినేట్ కే నిండుదనం వచ్చినట్లుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మా ప్రజాచైతన్యం ఛానల్ తరఫున.. హ్యాట్సాప్ టు డిఫ్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు.