ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ఇంట్లో అధికారులు ఐటీ రైడ్స్ నిర్వహిస్తన్నారు. ఈరోజు ఉదయం నుంచి విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ వార్త ఇప్పడు సర్వత్రా వైరల్ అవుతోంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని ఆయన ఇంట్లో ఉదయం ఏడు గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగి అయిన శ్రీనివాస్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత మాతృశాఖకు వెళ్లిపోయారు.

అదేవిధంగా పోలీసు బందోబస్తు మధ్యలో ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడతో పాటూ హైదరాబాద్‌లోని చంపాపేటలో ఉన్న ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారుల వెంట సీఐఎస్‌ఎఫ్ బలగాలు కూడా వచ్చాయి. వారికి భద్రతగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.

అయితే సచివాలయ ఉద్యోగి అయిన శ్రీనివాస్ 2019 వరకు చంద్రబాబు దగ్గర పీఎస్‌గా పని చేశారు. ఆయన పెద్ద మొత్తంలో ఆస్తులను కూడా పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కొన్ని కంపెనీలను ఏర్పాటు చేశారని సమాచారం. అందుకే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయంపై ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్‌కు సంబంధించి దాదాపు రూ.150 కోట్ల పైచిలుకు వ్యవహారాలకు సంబంధించి ఈ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే.. గతంలో చంద్రబాబు కార్యాలయంలో పనిచేసిన అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వలేదు. ఒక్క సతీష్ చంద్రకు మాత్రమే పోస్టింగ్ ఇచ్చింది. మిగతా ఐఏఎస్ ఇతర ఉన్నతాధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఇంకా ప్రభుత్వం వెయిటింగ్‌లోనే ఉంచింది. ఇప్పుడు చంద్రబాబు వద్ద పీఏగా పనిచేసిన శ్రీనివాస్‌ ఇంటిపై ఐటీ దాడులు జరగడం ఇటు టీడీపీ వర్గాల్లో అటు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.