ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్నుల శాఖ అధికారులు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రెండు వేలకోట్ల కుంభకోణాన్ని ఐటీ శాఖ బట్టబయలు చేయడం ఇప్పుడు సంచలనాంశంగా మారింది. పక్కా ఆధారాలతో స్కామ్ ను వెలుగులోకి తీసుకొచ్చింది ఐటి శాఖ. ఈ కుంభకోణం వెనుక రాజకీయ నేపథ్యం కూడా ఉండటంతో ఎలాంటి సంచలన విషయాలు బయటపడతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అదేవిధంగా ఈ స్కాంలో చంద్రబాబుకు సంబంధం ఉందని ఆయనను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో రాజకీయ రగడ నెలకొంది. చంద్రబాబును అరెస్టు చేయాలంటూ వైసీపీ నేతలు ఓ లేఖను కూడా విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో పాటు అనేక మంది టిడిపి నేతలపైన ఐటీ శాఖాధికారులు దాదాపు అయిదు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో దాదాపు 2000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా ఐటీ శాఖ అధికారులు వెల్లడిస్తోన్న ప్రకటనల ద్వారా తెలుస్తోంది. అయితే కడప జిల్లాకు సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు పలు కీలక పత్రాలతో పాటు కొంత నగదు.. బంగారాన్ని కూడా తీసుకెళ్లినట్లు ఆయన తల్లి మీడియాకు వెల్లడించడం విశేషం.

అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద గతంలో పర్సనల్ సెక్రెటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు సుదీర్ఘంగా ఐదు రోజుల పాటు జరిగాయి. మామూలుగా అయితే.. ఐటీ దాడులు ఒక రోజు లేదా రెండు రోజులు జరుగుతాయి. కానీ చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐదు రోజుల పాటు సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీన్ని బట్టి ఎంత సమాచారం ఐటీ అధికారుల వద్ద లేకుంటే.. ఇన్ని రోజుల సోదాలు జరుగుతాయని సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఇంకా విజయవాడలో శ్రీనివాస్ నివాసం ఉంటున్న కంచుకోట ప్లాజా నుంచి ఐటీ అధికారులు ఏమి స్వాధీనం చేసుకున్నారు? ముఖ్యంగా లాకర్ లో వీరికి ఏం లభ్యమైంది? అందులోని డైరీలు, హార్డ్ డిస్క్ లలో ఏం లభించిందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. శ్రీనివాస్ ఇంటితో పాటు లోకేశ్ సన్నిహితుడైన కిలారు రాజేష్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కు చెందిన అవెక్సా కార్పొరేషన్, వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డికి చెందిన ఆర్కే ఇన్ ఫ్రాల్లో కూడా  ఐటీ సోదాలు జరిగాయి. ఈ విచారణలో కీలక సమాచారం వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే వీరు అంతా చంద్రబాబుకు దగ్గరివాళ్లు కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారంలో చంద్రబాబు హ్యాండ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే చంద్రబాబుపై ఈ ఉచ్చుకూడా రచ్చచేసే అవకాశం లేకపోలేదు.