ఏపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. క్షణక్షణం ఏం జరుగుతుందో అన్నది చాలా ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతల్లో కొత్తగుబులు రేగింది. అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే.. బుల్ బుల్ పిట్ట అంటూ టీడీపీ నేతలు కక్కలేక మింగలేక తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు. అదీ జగన్ దెబ్బంటే.. అంటూ వైసీపీ శ్రేణులు మాత్రం పండుగ చేసుకుంటున్నాయి. ఇంతకీ ఏంటి…? ఆయా పార్టీ నేతల ఆందోళనకు కారణాలేంటి అంటే.. అదే శాసన మండలి వ్యవహారం.

ఏపీ శాసన మండలిలో కీలకమైన బిల్లులను వ్యతిరేకిస్తూ.. కొన్ని తిప్పి పంపించడం.. కొన్ని సవరణలు చేయడం.. మరికొన్ని సెలక్ట్ కమిటీకి పంపడం వంటివి చూస్తే ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నికైన రియల్ హీరోలైన ఎమ్మెల్యేలకు మండింది. దీంతో అస్సలు శాసన మండలి సభ్యులు మేధావులని.. సలహాలు.. సూచనలు ఇస్తారని అసెంబ్లీలో చేసిన తీర్మానాలను పంపిస్తుంటే.. వాళ్లు అది తమ చేతగాని తనంగా తీసుకొని ఆధిపత్య ధోరణితో అపరమేధావుల్లా ఇరుకున పెట్టడం భావ్యం కాదని.. అస్సలు ఈ శాసనమండలి అవసరా? అంటూ అసెంబ్లీ సాక్షిగా సభానాయకుడైన సీఎం వైఎస్ జగన్ దీనిపై చర్చ జరిపి సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని బాంబు పేల్చేశారు. ఇంకేముంది.. టీడీపీ నేతల గుండెల్లో గునపాలు గుచ్చినట్లైంది. హ.. హఠవిథీ అంటూ ఎవరికి వారు ఎమ్మెల్సీలు అంతా తమలో తాము ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. అసలు తమ భవిష్యత్తు ఏమైపోను అంటూ కుమిలిపోతున్నారు. పైకి గంభీరమైన మాటలు మాట్లాడుతున్నా.. లోలోపల మాత్రం తీవ్ర సంక్షోభంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.

అయితే సోమవారం జరగబోయే ఏపీ కేబినెట్ భేటీ.. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతుంది. శాసనమండలిని రద్దు చేసే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశముందని చర్చలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా గురువారం జరిగిన అసెంబ్లీలో సీఎం సహా మంత్రుల ప్రసంగాలు చూస్తుంటే శాసన మండలి రద్దయ్యే అవకాశాలను ఎవ్వరూ కొట్టిపారేయలేకపోతున్నారు. అయితే బిల్లులను నెగ్గించుకునేందుకు సర్కార్‌ ఇప్పటికీ తన ముందున్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నా.. చర్చ అంతా శాసన మండలి రద్దు చుట్టే తిరుగుతోంది. అయితే మండలి రద్దుపై పలువురికి పలు అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి మండలి రద్దు తీర్మానం రాష్ట్ర అసెంబ్లీ రెండు బై మూడు వంతుల మెజారిటీతో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. అలా పంపించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వంలోని లా డిపార్ట్మెంట్ ఒక నోట్ తయారు చేసి ఆ తర్వాత బిల్లు తయారు చేసి పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. పార్లమెంటు ఉభయసభలు దీనిపై చర్చించి బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపించాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డాక ఈ బిల్లు ఆక్ట్ గా మారి అమలులోకి వస్తుంది. ఇంత తతంగం జరగాలి. ఇంత చేస్తారా.. ? ఇప్పటికే ఈ విషయంలో మండలి చైర్మన్ వెనక్కి తగ్గి ఇంకా తతంగం పూర్తి కాలేదు.. సెలక్టే కమిటీకి పంపలేదనే విషయంపై కూడా టాక్ నడుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో శాసనమండలిని ఏం చేస్తారనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిసెటైర్ వేశారు. శాసనమండలిలో ఏదో సాధించారని పూల వర్షం కురిపించినవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు మండలికే ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి వెల్లడించారు. మరిప్పుడు పూల ఖర్చు వృథా అయినట్టేనా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి చుట్టు ముట్టిందేమిటి విజనరీ? అంటూ చంద్రబాబుపై విజయసాయి సెటైర్ వేశారు.

ఇంకా.. మాజీ మంత్రి దేవినేని ఉమాపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏమన్నారంటే.. ఉమా.. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది.. ఇసుక మాఫియా ద్వారా ఎన్ని వేలకోట్లు పోగేసుకున్నది తొందర్లోనే బయట పడుతుంది. కాస్త ఓపిక పట్టు ఉమా. మ్యావ్ మ్యావ్‌లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించుకున్నా.. సింహంలా గర్జించ లేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి… నువ్వు నీతులు వల్లిస్తే ఎలా.. ? అంటూ విజయసాయి ట్విట్టర్ వేదికగా తూటాలు పేల్చారు. అన్నింటికంటే.. శాసనమండలిలో తీర్మానాన్ని ఆపించుకున్న బాబు రాజధాని ప్రజలతో పూలు చల్లించుకున్నారు. మరిప్పుడు ఆ మండలే రద్దువుతుంటే అక్కడి వారంతా ఛీఛీ.. మా పూలబుట్ట వేస్టయ్యింది అంటూ గుసగుసలాడుకుంటున్నారు.