జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జగన్ తో జోడి కట్టనున్నారు. ప్రస్తుతం పింక్ అనే బాలీవుడ్ చిత్ర రీమేక్ లో పవన్ కల్యాణ్ నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నా అన్ని కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయి. అలాగే.. ఈ సినిమాలో సెన్సేషనల్ సింగర్ సిధ్ శ్రీరామ్ ఓ పాట పాడబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే టైటిల్ విషయంలో ‘లాయర్ సాబ్’, ‘వకీల్ సాబ్’ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా… ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వరుసబెట్టి డైరెక్టర్స్ కు డేట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేసి వచ్చే నాలుగేళ్లలో 400కోట్ల వరకు సంపాదించి ఈసారి బలంగా ఏపీలో రాజకీయాలు చేద్దామని దృఢనిశ్చయంతో ఉన్నారు పవన్ కల్యాణ్. అందులో భాగంగా.. పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో ఓ సినిమాకు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. అందుకు తగినట్లుగా క్రిష్ కూడా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీతో హృదయానికి హత్తుకునేలా చేసే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే….. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో పాటు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా కూడా ఒక సినిమా చేయనున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. వాస్తవానికి పూరి జగన్నాధ్ ని డైరెక్టర్ గా టాలీవుడ్ కి పరిచయం చేశారు పవన్ కల్యాణ్. మొదటి సారిగా.. పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా బద్రి అనే సూపర్ హిట్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత వీరి కలయికతో వచ్చిన కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమా ఘోరంగా దెబ్బతింది. ఇకపోతే ముచ్చటగా మూడవ సారి పవన్ తో పూరి జగన్… జతకట్టనున్నట్లు పెద్దఎత్తున టాక్ నడుస్తోంది. ఆయన కోసం ఒక మంచి మాస్, యాక్షన్ స్టోరీని పూరి రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాను ప్రకటించిన విజయ్ దేవరకొండ సినిమా.. అలానే డబుల్ ఇస్మార్ట్ సినిమాల తర్వాత పవన్ సినిమాని మొదలెడతారని అంటున్నారు. త్వరలోనే తమ కాంబోలో సినిమా విషయమై పూరి జగన్, పవన్ లు కలుస్తారని.. తెలుస్తోంది. అంతేకాకుండా.. ప్రస్తుతానికైతే తాను ఒప్పుకున్న ప్రాజక్ట్స్ పూర్తికాగానే.. మీతో సినిమా చేస్తానని జగన్ కు పవన్ కల్యాణ్ మాటకూడా ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. అందుకోసం ఓ మంచి స్టోరీని డెవలప్ చేసే పనిలో పడ్డారంట పూరి. ఇంకేముంది.. అన్నీ కలిసి వస్తే.. వచ్చే ఏడాదిలో ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. మొత్తానికి పూరి జగన్.. పవన్ ల కలయిక త్వరలోనే రానుందన్నమాట.