ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగి ప్రజాసమస్యలను తెలుసుకొని ఆ విధంగా పరిష్కరించడం ఇష్టం. అందులో భాగంగానే 2017 నవంబర్ 6న కడపజిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ లో ప్రారంభమైన పాదయాత్ర 341 రోజులు సుదీర్ఘకాలం సాగి ఇఛ్చాపురంతో ముగిసింది. తన పర్యటన కాలంలో ఆయన 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. అలా జగన్ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా ప్రజలతో మమేకమై వారి సమస్యలకు పరిష్కారం చూపడంలోనే ఆనందం ఉందంటున్నారు.

అందులో భాగంగా తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 1వ నుంచి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రజా నాయకుడుగా ఎదిగిన వైఎస్ జగన్ ఈరోజు సచివాలయంలో ‘స్పందన’పై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయాల్లో పెన్షన్లు, బియ్యం కార్డులకు సంబంధించిన అర్హుల జాబితాలను ప్రదర్శించారా? లేదా? అని ఆరా తీశారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సాధికార సర్వేకు, ఇళ్ల పట్టాల వ్యవహారానికి లింక్ పెట్టొద్దని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే స్థలం వారి ముఖాల్లో సంతోషాన్ని నింపాలన్నారు సీఎం జగన్.

అదేవిధంగా స్పందనలో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. 60 శాతం వరకు బియ్యం కార్డులు, పెన్షన్లు, ఇళ్ల పట్టాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇక.. ఫిబ్రవరి నుంచి మొత్తంగా 54 లక్షల పెన్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపిన సీఎం… పెన్షన్లు ఫిబ్రవరి 1 నుంచి డోర్‌ డెలివరీ చేస్తున్నామని వివరించారు. ఫిబ్రవరి 15 నుంచి 21 వరకూ కొత్త పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. బియ్యం కార్డుకోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే… 5 రోజుల్లోగా వారికి గ్రామ సచివాలయాల్లో కార్డు మంజూరు చేయాలని ఆదేశించారు.

అంతేకాకుండా 25 లక్షలమందికి మహిళల పేర్లమీద 10 రూపాయల స్టాంపు పేపర్లమీద ఇళ్లపట్టాలు ఇవ్వనున్నట్టు తెలిపారు సీఎం వైఎస్ జగన్. లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ఉంటుందని.. ఫిబ్రవరి 15లోగా ఇళ్లపట్టాల అర్హుల జాబితా సిద్ధం కావాలని తెలిపారు. ఎవరివల్ల కూడా అన్యాయం జరిగిందన్న మాట రాకూడదని తెలిపిన ఆయన.. ఇళ్లపట్టాలు ఇవ్వదలచుకున్న స్థలాలను ఖరారు చేసేముందు లబ్ధిదారుల్లో మెజార్టీ ప్రజలు దీనికి అంగీకారం తెలపాలన్నారు. మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, వారికి మంచి జరగాలని వివరించిన వైఎస్ జగన్.. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అన్నారు. అలాగే… రైతు భరోసా కేంద్రాల ద్వారా మనదైన ముద్ర వేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాల దగ్గరకే రైతు భరోసా కేంద్రాలు వెళ్లాలని.. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి 11వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావాలని వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే ప్రాజెక్టు ఇది అని తెలిపిన ఆయన నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు, ఎరువులను గ్రామస్థాయిలో రైతులకు అందిస్తామని తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా మూడో విడత కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం వైఎస్ జగన్.. గ్రామ స్థాయిలో స్క్రీనింగ్‌ చేయాలని… ఫిబ్రవరి 1 నుంచి వైఎస్ఆర్ కంటి వెలుగు మూడో విడత దాదాపు 1.25 కోట్ల మందికి స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయించామని వైఎస్ జగన్ వివరించారు. అలాగే తాను ఫిబ్రవరి 1 నుంచి ప్రజల వద్దకు నేరుగా వస్తున్నానని.. అక్కడ తనకు ఎలాంటి వివాదాలు దృష్టికి రాకూడదని వైఎస్ జగన్ వివరించారు.