ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల విధానాలను వెంటాడుతోంది అధికార వైసీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేలా చేసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విధానాలను ప్రక్షాళన చేసే దిశగా వైఎస్ జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఒక్కక్కటి క్లీన్ చేసుకుంటూ పాలనలో భాగస్వామ్యం చేస్తుంది. అధికారులను, ప్రభుత్వ విధానాలను శుభ్రం చేసేలా ఎంతో సాహసంతో కూడిన నిర్ణయాలను తీసుకుంటుంది. అలాంటి సాహసాలను తెగువ కావాలని.. మా నాయకుడు రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు.

అదేవిధంగా తాజాగా టీడీపీ నేత.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ సర్కార్ నుండి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. మొదట బస్సులు సీజ్ నుంచి మొదలుకొని.. మొన్నటి ఫోర్జరీ కేసు వరకూ వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇదే సమయంలో ఆయనకు మరో షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఆయన ఓడిపోయి ఇంటికే పరిమితం అయ్యాక గన్‌‌మెన్‌ లను 2+2 నుంచి 1+1 కు ఏపీ ప్రభుత్వం కుదించింది. అయితే ఇప్పడు తీసుకున్న నిర్ణయం మరింత షాక్ కు గురి చేస్తుంది. అదేమంటే.. ఆయన భద్రత కోసం కేటాయించిన 1+1 గన్‌మెన్లను కూడా పూర్తిగా తొలిగిస్తూ.. జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాలతో గత రాత్రి జేసీ దివాకర్‌రెడ్డికి భద్రత తొలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నేతల భద్రతను కూడా ప్రభుత్వం తొలగించింది. భద్రతను తొలగించిన వారిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఉన్నారు. స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే భద్రత తొలగించామని పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే తమ భద్రత తొలగింపుపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు.. సమాచారం ఇవ్వకుండా.. ఉన్నపళంగా భద్రత తొలగించడం ఏంటని ప్రభుత్వాన్నిఆయా నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు భద్రత కొనసాగించారని వివరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటసారిగా.. భద్రతను కుదించి..ఆ తర్వాత ఇప్పుడు పూర్తిగా భద్రతను తొలగించడంపై నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లకుండా నిలువరించేందుకే.. ప్రభుత్వం ఇప్పుడు భద్రతను తొలగించిందని ఆయా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.