ప్రపంచ దేశాలనే శాసించే అగ్రదేశం అమెరికా. ఇప్పుడు ఈ అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25వ తేదీలలో భారత్ పర్యటనకి రానున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా భారత్ పర్యటనకి రావడం ఇదే తొలిసారి. అయితే ట్రంప్ భారత్ పర్యటన కోసం కొన్ని కోట్లు వెచ్చిస్తోంది. భారత ప్రభుత్వం కేవలం ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి.. ఆయన పర్యటన విజయవంతం అయ్యిందనిపించడానికి… ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రంప్ పర్యటించే రోడ్లు ప్రాంతాలన్నీ ప్రస్తుతం అద్దంలా మెరిసిపోతున్నాయి. అయన వెళ్లే రోడ్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదో పూలబాట. స్వర్గదామంలా ఉంటుంది. అయితే ట్రంప్ హైప్రొఫైల్ కు తగినట్టుగా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అహ్మదాబాద్ లోని మురికివాడలు కనిపించకుండా వాటికీ అడ్డుగా గోడలని కట్టి చాలా అందంగా తీర్చుదిద్దుతున్నారు. అలాగే రోడ్లపై ఉండే పాన్ షాపులను మూసివేస్తున్నారు.

భారత్.. ట్రంప్ కోసం ఇంత హడావుడి చేస్తుంటే అమెరికా మీడియా మాత్రం సెటైర్లు పేలుస్తోంది. అయితే ట్రంప్.. భారత పర్యటనకు ముందే అభివృద్ధి చెందుతున్న లిస్టులో నుంచి భారత్ నుంచి తొలగించాలని నిర్ణయించారు. అంటే.. తలసారి ఆదాయం సుమారుగా.. 2వేల డాలర్లు ఉన్నప్పటికీ… 12375 డాలర్ల మార్కు కంటే తక్కువగా ఉన్నా కూడా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. కానీ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన భారత్ ఆర్థికంగా స్థిరంగా లేదనే చెప్పాలి.

అసలు విషయం చెప్పాలంటే భారత ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు. రోజురోజుకీ క్షీణిస్తుంది. కానీ.. ఇదే సమయంలో ట్రంప్ పర్యటనకి వస్తుండటంతో భారత్ ఆర్థికలోటు గుట్టు అగపడకుండా పైకి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అందుకే ట్రంప్ పర్యటించే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయో అమెరికా మీడియా ఏకిపారేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కు గోడలంటే బాగా ఇష్టమా? అంటే.. ఒక రకంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే.. అమెరికా-మెక్సికో సరిహద్దులో ఒక పెద్ద గోడను నిర్మించాలని ట్రంప్ చేసిన ప్రయత్నాలు కొనసాగలేదు. ఇప్పడు అలాంటి పెద్దగోడను తలపించేలా భారత్ పర్యటనలో ట్రంప్ ను ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడు ట్రంప్ అహ్మదాబాద్ లో అడుగుపెట్టడానికి ముందే ఏడు అడుగుల 400 మీటర్ల పొడవైన గోడను నిర్మించాలని అధికారులు డిసైడయ్యారు. స్టేడియానికి వెళ్లే మార్గంలో మురికి వాడలు ఉన్నాయి. అవి కనిపించకుండా ఉండేందుకు ఈ గోడను నిర్మించారా ఏంటి? అన్నట్టుగా అమెరికా మీడియా సెటైర్స్ గుప్పించేస్తుంది. ఈ గోడల నిర్మాణానికి సుమారు రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మురికివాడలను దాచడానికి ప్రయత్నించే బదులు వాటిని అభివృద్ధి చేయడానికి అదే ఖర్చు చేస్తే బాగుండేదని యూఎస్ మీడియా భారత్ కి చెప్పకనే చెప్తుంది. కేవలం ట్రంప్ 3గంటల పర్యటన కోసం గుజరాత్ సర్కార్ రూ. 100కోట్లు వెచ్చించడం, ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు మరో రూ. 4 కోట్లు ఖర్చుపెట్టడం, అలాగే.. రోడ్ షోకు సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రత కల్పించడం అవసరమా అనే ప్రచారం కూడా పెద్దఎత్తున సాగుతుంది.

అంతేకాకుండా ట్రంప్ పర్యటనకు ముందుగానే.. కనీసం 60 అంతర్జాతీయ – దేశీయ విమానాలను రీ షెడ్యూల్ చేశారు అధికారులు. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి వచ్చే ప్రముఖ వ్యక్తుల కోసం 10 బేసి విమానాలు మాత్రమే ఉన్నాయి. ఇతర విమానాలు సూరత్ లేదా బరోడాకు మళ్లించారు. గోడ నిర్మించడానికి డబ్బు సరిపోకపోతే – ట్రంప్ పర్యటించే 22 కిలోమీటర్ల రహదారి కోసం స్థానిక అధికార యంత్రాంగం రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ వెళ్లే ఈ మార్గంలో ప్రతిచోట 28 దశలుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం – లక్షలకు పైగా చెట్లు – ఫ్లవర్ బెడ్స్ – స్టేడియం దగ్గరకు ప్రజలను తరలించేందుకు 2200కి పైగా బస్సులను పంపడం వంటివి విషయాలు ఉన్నాయి. దీనిపై యూఎస్ మీడియా కాస్త ఘాటుగానే ప్రపంచానికి ఎరుకపరుస్తోంది. అంతేకాకుండా అసలే ఆర్థికలోటులో ఉన్న భారత్ ట్రంప్ పర్యటనకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని వ్యంగ్యాస్త్రాలు విసురుతుంది.