ఏపీలో రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందడంలో భాగంగా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగా తాజాగా దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తుంది. ఆదిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రానికి ఏపీ పరిశ్రమల శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపినట్లు తెలుస్తోంది.

అయితే దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని.. పరిశ్రమల శాఖ మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలకు దొనకొండ అనువైన ప్రాంతమని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళింది. తాజాగా లక్నోలో జరుగుతున్న ఇండో-ఫ్రెంచ్ డిఫెన్స్ ఎక్స్ పోలో ఏపీ పరిశ్రమల శాఖామంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అలాగే.. ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమల స్థాపనకు వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం కీలకమని ఏపీ స్పష్టం చేసింది.

అంతేకాకుండా ఫ్రెంచ్ కంపెనీలతో కలసి పని చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించడం విశేషం. ఇంకా ప్రకాశం జిల్లాలోని దొనకొండకు అత్యంత సమీపంలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులకు అవకాశముందని కూడా గౌతమ్ రెడ్డి వివరించారు. దొనకొండలో ఉన్న మెరుగైన మరిన్ని అవకాశాలపై పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.

ఇక్కడో విషయం చెప్పాలి. దొనకొండలో వేల ఎకరాల ప్రభుత్వభూమి ఉందని.. అక్కడ ఏపీ రాజధానికి అనుకూల ప్రాంతమని చాలా కాలంగా టాక్ వినిపిస్తూ.. ఉంది. కానీ… గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతి కేంద్రంగా భారీస్కామ్ లతో కూడుకొని అటూ ఇటూ కాని నిర్మాణాలతో ఎటూ కాకుండా చేసింది. ప్రస్తుతం ఏపీలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ సర్కార్ కీలకంగా అడుగులు వేస్తుంది. దీంతో వైజాగా పరిపాలనా రాజధానిగా.. అమరావతిని చట్టపరమైన రాజధానిగా.. కర్నూలును న్యాయపరమైన రాజధానిగా విభజించి పరిపాలించబోతున్నారు. అందులో భాగంగా ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన దొనకొండ ప్రాంతంలో భారీ పరిశ్రమలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం వ్యూహాలను రచిస్తుంది.