ఆంద్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓ ప్రభజనంలా ఏర్పాటైంది. 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లతో అత్యధిక మెజార్టీని సాధించి చరిత్ర సృష్టించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రజారంజకంగా పాలన చేస్తున్నారు. దీంతో ఏపీ అంతా వైసీపీమయంగా మారింది. అయితే ఇప్పడు ఏపీలోనే కాకుండా ఢిల్లీలో కూడా వైసీపీ హవా చాటింది. ఢిల్లీ పార్లమెంట్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీకి స్పీకర్ నూతన కార్యాలయాన్ని కేటాయించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 22 మంది ఎంపీలను గెలుచుకున్నారు. ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని వైఎస్ఆర్సీపీ సభ్యులకు కేటాయించారు.

అయితే ఇది ఓ రకంగా టీడీపీ కోట అనే చెప్పాలి. అదెలాగంటే.. ఈ గదిలోనే గత 30 ఏళ్లుగా టీడీపీ కార్యాలయం కొనసాగుతోంది. సరైన సంఖ్యలో సభ్యులు లేనప్పటికీ బయటి శక్తుల ఒత్తిడి మేరకు అదే కార్యాలయంలో మూడు దశాబ్దాలుగా టీడీపీ తిష్టవేసుకుంటూ వస్తుంది. ఇలాంటి సమయంలో వైసీపీ సభ్యులు ఆ విషయాన్ని జాగ్రత్తగా పసిగట్టి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది ఎంపీలు గెలవడంతో ఆ కార్యాలయాన్ని వారికి కేటాయిస్తున్నట్లు స్పీకర్‌ తాజాగా ప్రకటించారు.

అదేవిధంగా మూడో అంతస్తులోని 118 నెంబర్ గదికి టీడీపీ కార్యాలయాన్ని తరలించారు. మూడు నెలల కిందటే అయిదో నెంబర్ గది కేటాయించినా ఖాళీ చేయలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పీకర్ కు రాసిన లేఖ ద్వారా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాగా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా.. మరోసారి వైసీపీ ఎంపీలంతా ఓం బిర్లాను కలవడంతో లేఖపై స్పీకర్ స్పందించారు. ఆయన ఆదేశాలతో పార్లమెంట్‌ సిబ్బంది.. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదికి టీడీపీ బోర్డును తొలగించి.. వైఎస్సార్‌సీపీ కార్యాలయంగా మార్చారు. ఈ కార్యాలయానికి సమీపంలోనే ప్రధానమంత్రి మోడీ పదో నెంబర్ గది, హోం మంత్రి అమిత్‌ షా కార్యాలయం కూడా ఉండటం విశేషం.