తెలంగాణ రాష్ట్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అధినేత అరవింద్ కేజ్రివాల్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాలకు కూడా పార్టీని విస్తరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా ఆప్ తెలంగాణపై దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది. త్వరలో రాబోయే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఢిల్లీ విజయంతో మాంచి ఊపుమీద ఉన్న కేజ్రివాల్ తెలంగాణలో కూడా పార్టీని విస్తరించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తోడు తాజాగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ వార్డులో ఆప్ అభ్యర్ధి విజయాన్ని అందుకోవడంతో స్థానిక ఎన్నికల్లో ఆప్ ఖాతా తెరిచినట్లైంది.

అదేవిధంగా తాజాగా అంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బి. రాము గౌడ్, జాయింట్ సెక్రటరీ రహీద్-ఉల్-హక్, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ యేడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆప్ ప్రధానంగా దృష్టి సారించాలని కేజ్రివాల్ కోరారు. ఈ ఎన్నికల ప్రచారానికి వచ్చేసి ఆప్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తెలంగాణ ఆప్ నాయకులు కోరారు. ఆ సమయంలో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం హైదరాబాద్ లోని కోర్ ఇష్యూని తెలుసుకొని చెప్పాలని.. అదేవిధంగా లోకల్ బాడీస్ ను ఏర్పాటు చేసి పెద్దఎత్తున రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేయమని కేజ్రివాల్ తెలిపినట్లు రామ్ గౌడ్ వివరించారు.

అంతేకాకుండా జాతీయస్థాయిలో ఆప్ కోటి సభ్యత్వం ఫిబ్రవరి 23నుంచి మార్చి 23వరకు నమోదు కార్యక్రమం పెద్దఎత్తున జరపాలని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో కూడా సభ్యత్వ నమోదు భారీగా జరగాలని కేజ్రివాల్ చెప్పినట్లు రామ్ గౌడ్ వివరించారు. కాగా తెలంగాణ ఆప్ విభాగానికి ప్రియాంక కక్కర్ పరిశీలకులుగా ఉంటారని… సమస్యలు తెలుసుకొని జీహెచ్ఎంసీ ఎన్నికలకు రెడీ కావాలని కేజ్రివాల్ కోరినట్లు రాము గౌడ్ వెల్లడించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి రాకముందు నుంచి ఆ పార్టీకి హైదరాబాద్, బెంగళూరు వంటి దక్షిణాది నగరాల్లో ఫాలోయింగ్ ఉంది. కేజ్రీవాల్ పిలుపు మేరకు ఇక్కడ కూడా ఆప్ అభిమానులు కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పుడు పార్టీ బలోపేతం పైన ఆప్ మరింత దృష్టి సారించనున్నట్లు సమాచారం అందుతుంది.