చూడగానే నయనానందాన్ని కలిగించే అందం నయనతార సొంతం. లేడీ సూపర్‌స్టార్ పేరొందిన నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్ అని అందరికీ తెలిసిందే. 2003లో ఆమె ‘మనస్సినక్కరే’ అనే మలయాళ సినిమా ద్వారా సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకుడు. సినిమా టైటిల్స్ వేసేటప్పుడు నయన్ పేరును డయానా కాకుండా నయనతార అని వేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు ఆమె పేరు నయనతార అని ఫిక్స్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తానేంటో అన్ని భాషల్లో నిరూపించుకుంది. తన కంటూ ప్రత్యేక సత్తాను చాటుకుంది.

అయితే ఇప్పుడు నయనతారకు ఈ పేరు ఎవరు పెట్టారు అని ఇద్దరు దర్శకులు కొట్టుకుంటున్నారు. ఆ పేరు నేను పెట్టానంటే నేను పెట్టానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ విపరీతంగా చేసుకుంటున్నారు. నయనతారకు ఆపేరు పెట్టింది నేనే అంటూ ఈ మధ్య డిట్టో జాన్ అనే దర్శకుడు అన్నారు. దాంతో సత్యన్‌కు మండింది. సోషల్ మీడియా ద్వారా తన బాధను వెళగక్కారు. ‘నేను, నా స్నేహితుడైన డైరెక్టర్ రంజన్ ప్రమోద్ నయనతారకు ఆ పేరు పెట్టాం. నాకు జాన్ డిట్టో ఎవరో కూడా తెలీదు. అసలు ఈ విషయంపై ఇంత చర్చ జరపాల్సి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ‘మనస్సినక్కరే’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ రోజు ఉదయం నేను, దర్శకుడు రంజన్ కలిసి నయనతారకు ఏం పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచించుకున్నాం. అప్పుడు నయనతార అన్న పేరు తట్టింది. మేం తయారు చేసిన పేర్ల జాబితాలో నయనతార పేరును యాడ్ చేసి నయన్‌కు ఇచ్చాం. తనకు కూడా ఆ పేరే నచ్చింది. అదే తన స్క్రీన్ నేమ్ అయిపోయింది’ అని డైరెక్టర్ సత్యన్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

ఇప్పుడు వీరిద్దరి మధ్య వార్ తో అసలు తన పేరును ఎంచుకుంది నయనతార అని క్లియర్‌గా అందరికీ అర్థమైపోయింది. కానీ.. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందో అర్థంకావడంలేదు. ‘దర్బార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయన్ ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న ‘మూకుట్టి అమ్మన్’, ‘నెట్రికన్’ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.