టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్ లోని మేడం టుస్సార్ మ్యూజియంలో ఆమె మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. చందమామలా తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి రాజమౌళి మగదీరతో పంచదార బొమ్మలా ప్రేక్షకులను అలరించి.. తన అందం.. ఆకట్టుకొనే అభినయంతో ఫ్యాన్స్ గుండెలను కొల్లగొట్టిన కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మగా మెరిశారు.

తెలుగు తెర అందాల చందమామ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరింది. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్‌ లో కాసేపటి క్రితమే కొలువు తీరింది. ఈ కాజల్ మైనపు బొమ్మను తయారు చేయడానికి మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు కాజల్‌కు సంబంధించిన కొలతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మైనపు విగ్రహాన్ని కాజల్ అగర్వాల్.. తన చెల్లి నిషా అగర్వాల్‌తో కలిసి ఆవిష్కరించింది. కాజల్ అగర్వాల్.. మిక్స్‌ డ్ కలర్‌లో ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ తన చిన్న తనాన్ని గుర్తు చేసుకున్నారు.‘నాకు 12 ఏళ్ల వయసులో ఈ మ్యూజియంకు వచ్చాను. ఆ అనుభూతి ఇంకా నన్ను అంటిపెట్టుకునే ఉంది. మహాత్మా గాంధీ విగ్రహం పక్కన నిలుచుని ఆయనను కలిసిన అనుభూతి పొందాను. బీటిల్స్ పక్కన కూచుని ఫోటోలు తీసుకున్నాను. అప్పుడు నాకు తెలీదు నాకు కూడా భవిష్యత్ లో ఇక్కడ స్థానం దొరుకుతుందని’ అంటూ వివరించారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుందని వివరించారు.

ఇప్పటికే బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, హృతిక్‌ రోషన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ విగ్రహాలు అక్కడ కొలువుదీరాయి. అలాగే.. సౌత్ లో తొలిసారిగా ప్రభాస్.. మేడమ్ టుస్సాడ్స్‌ కు సంబంధించిన మ్యూజియంలో మైనపు బొమ్మగా స్థానం సంపాదించాడు. ఆ తర్వాత మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో కొలువైన మేడమ్ టుస్సాడ్స్‌ లో రూపొందించారు. తాజాగా సౌత్ నుంచి మూడో వ్యక్తిగా కాజల్ అగర్వాల్ ఈ మ్యూజియంలో బొమ్మగా కొలువు తీరింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. ప్యారిస్ ప్యారిస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. మరోవైపు ఆమె ముంబాయి సాగా, ‘ఇండియన్ 2’ మోసగాళ్లు వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇదే సమయంలో ఇంత అరుదైన గౌరవం కాజల్ దక్కడంతో అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. నిజంగా కంగ్రాట్స్ కాజల్.