ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నాళ్ల నుంచో ఆ పార్టీలో ఉన్న ఒక్క నేత కూడా మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తారని అంతా భావిస్తున్నారు. అనుకున్నట్లుగానే అంతా అయిపోయింది. చక్కగా సమయం కోసం వేచి చూస్తున్న మాజీ జేడీ జనసేన పార్టీకి రిజైన్ చేశారు. సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్‌ విధానాల్లో నిలకడ లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. పూర్తి సమయం రాజకీయాలకే వెచ్చిస్తాను.. ప్రజా సేవకే జీవితం అంకితం అని చెప్పిన పవన్.. మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారనే కారణంతో రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అదేవిధంగా తాను వ్యక్తిగతంగా జనసైనికులకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆయన రాజీనామా లేఖను పంపారు. ఆయన రాజీనామా జనసేన పార్టీకి గట్టి ఎదురు దెబ్బనే చెప్పాలి.

అయితే ఈ దెబ్బతో జనసేనానికి దిమ్మతిరిగి అసలైన రాజకీయాలు గుర్తు వచ్చే అవకాశాలు లేకపోలేదని ట్రోల్ జరుగుతుంది. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ అనే చెప్పవచ్చు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేయడం అనేది ఎప్పుడో ఒకరోజు జరిగేదే.. ముందుగానే అంతా ఊహించిందే అని కొంత మంది విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే చాలా కాలంగా ఏం చూపి బయటకు వెళ్లాలి అని వేచి చూస్తున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణకు పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ఓ అవకాశంగా దొరికినట్లైంది. దీంతో పవన్ నిలకడలేని విధి విధానాల కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు లక్ష్మీనారాయణ.

ఇప్పుడు లక్ష్మీనారాయణ నిర్ణయం జనసేన శ్రేణుల్లోనే కాకుండా.. ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. లక్ష్మీనారాయణ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజా సేవ కోసం తాను నటనకు పూర్తిగా స్వస్తి చెబుతానని గతంలో అనేకసార్లు పవన్ కళ్యాణ్ చెప్పారని… కానీ ఆయన మళ్లీ నటించాలని నిర్ణయించుకోవడం సరికాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్‌లో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్టు లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ కొంత కాలంగా పార్టీ తీరు, పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు. జనసేనకు గుడ్ బై చెబుతారని వార్తలు వచ్చాయి. చివరికి అదే నిజమైంది. చాలా కాలానికి మంచి నిర్ణయం తీసుకున్నారని మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.