వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యాక కేంద్ర నుంచి అటు పలు ప్రముఖ సంస్థల సర్వేల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ర్యాంకుల పంట పండుతుంది. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వైఎస్ జగన్ అత్యుత్తమ పాలనకు గాను దేశంలోనే నాలుగో ర్యాంకు వచ్చింది. తాజాగా ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో ఆంధ్రప్రదేశ్‌కు మూడు ర్యాంకులు దక్కాయి. ఇందుకు సంబంధించి కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ ఓ ప్రకటన వెల్లడించింది. అయితే ఫిబ్రవరి 3వతేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తారు. పీఎంఎంవీవై అమలులో భాగంగా 2019 డిసెంబర్‌ 2 నుంచి డిసెంబర్‌8 వరకు నిర్వహించిన మాతృ వందన పథకంలో ఏపీకి ఫస్ట్ ర్యాంక్ దక్కింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2వ ర్యాంకు సాధించినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ రెండింటితో పాటు దేశవ్యాప్తంగా జిల్లాల వారీ ప్రతిభలో కర్నూలుకు 2వ ర్యాంకు దక్కడం విశేషంగా చెప్పవచ్చు.

అలాగే.. ఈ పథకం గర్భిణుల కోసం రూపొందింది. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్తూ.. సక్రమంగా వైద్య పరీక్షలకు రాని గర్భిణులను ఆస్పత్రులకు వచ్చేలా ప్రోత్సహించడంలో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. వారిని క్రమం తప్పకుండా ఆస్పత్రులకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తే వారికి కాన్పు అయ్యేవరకూ 3దశల్లో రూ.5 వేలు ఇస్తారు. గర్భిణి ప్రభుత్వాసుపత్రిలో పేరు నమోదు చేసుకోగానే రూ.1,000, ఆరు మాసాలు అయ్యాక రూ.2,000, ప్రసవం జరిగాక బిడ్డకు మూడున్నర నెలలు ఇస్తారు. అలాగే.. వయసొచ్చాక వ్యాధి నిరోధక టీకాలు వేయించుకున్న తర్వాత మరో రూ. 2,000 ఇస్తారు.

అదేవిధంగా ఈ ఐదు వేల రూపాయలతో పాటు ప్రసవం సమయంలో జననీ సురక్ష యోజన కింద మరో వెయ్యి రూపాయలు ఇస్తారు. ఏపీలో ప్రతి ఏటా 7 లక్షల ప్రసవాలు జరుగుతుండగా 3 లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవాలకు వస్తున్నారు. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ కు గర్భిణులను తీసుకొచ్చి ప్రసవాలు చేయించడంలో ఆంధ్రప్రదేశ్‌ విశేష ప్రతిభ ప్రదర్శించిందని.. ఇంకా అన్నింటికంటే.. కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకురాగలిగారని కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది.

అంతేకాకుండా ఆశా కార్యకర్తల నుంచి ఏఎన్‌ఎంలు, వైద్యుల వరకు అందరూ కలిసికట్టుగా కష్టపడి పని చేశారు. వాళ్ల కృషి కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు ర్యాంకులు రావడం విశేషం. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో మరింత ప్రోత్సాహకరంగా ఏపీకి వైద్యరంగంలో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకోవడం రెట్టింపు ఉత్సాహాన్నించిందని వైద్యాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.