ఏపీలో ఐటీ రైడ్స్ కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఏమాత్రం లెక్కచెప్పకుండా అడ్డగోలుగా అందినంత దోచుకొన్న నేతలకు చమటలు పడుతున్నాయి. క్షణక్షణం ఏం జరుగుతుందోనని నేతలు హడలెత్తిపోతున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వద్ద పీఎస్ గా చేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటీ రైడ్స్ తాలూకూ ప్రకంపణలు ఏపీ రాజకీయాలను వేడెక్కించేస్తున్నాయి. ఐటీ సోదాలతో సంబంధం ఉన్న నేతలకు నిద్రలేకుండా చేస్తుంది. దీంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. పీఎస్ ఇంట్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుంటే.. లేదు, లేదు రూ.2లక్షల 63 వేలే దొరికాయని టీడీపీ వెల్లడిస్తుంది. ఇదే అసలు నిజం అంటూ.. ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్ట్‌ ను బయటపెట్టారు తెలుగు తమ్ముళ్లు. వైఎస్సార్‌సీపీ తమ అధినేతపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

అయితే ఇదిలా ఉంటే చంద్రబాబు పీఎస్.. శ్రీనివాస్ ఎపిసోడ్‌పై ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టైం దొరికిందే తడవుగా.. టీడీపీ నేతలపై వారి వ్యవహార శైలిలో నిరంతరం ఎత్తి చూపే విజయసాయిరెడ్డి.. ఈసారి డిఫరెంట్ గా విరుచుకు పడ్డారు. ఆయన ఏమన్నారంటే.. ఇంత బతుకు బతికి ఇంటెనక.. అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్లు.. ఐటీ దాడుల తర్వాత క్లియర్‌గా అర్థమైందని.. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశారు అని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి ట్వీట్లకు క్రేజ్ ఎక్కువ. దీంతో ఇప్పుడు చంద్రబాబునాయుడు.. ఆయన పీఎస్ శ్రీనివాస్ వద్దే అతని ఆస్తుల తాలూకూ పాస్ వర్డ్ ఉందని.. అది ఇప్పుడు లీకై పోయిందని.. బాబు గుట్టంతా బయటపడిందన్న వార్త సర్వత్రా వ్యాపించింది. మొత్తానికి విజయసాయిరెడ్డి గారి ట్వీట్లు భలే వైరలైపోతుంటాయి. అంటే అందులో లోతైన విషయం ఉంటుందిలే అంటున్నారు వైసీపీ వర్గాలు.

అంతేకాకుండా విజయసాయిరెడ్డిగా వేసిన మరో ట్వీట్ లో… ‘చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ కమిట్మెంట్‌ని మెచ్చుకోవాలి.. యజమాని ప్రతిలావాదేవీనీ డైరీలో రాసుకున్నాను అని చెప్పాడు. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసాడు. ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచాడు. దోచుకున్నవి, దొంగదారుల్లో పంపిన లెక్కలన్నిటినీ పర్ ఫెక్టుగా రికార్డు చేసాడు’ అంటూ విజయసాయిరెడ్డి విషయాన్ని చక్కా తెలియపరిచాడు. మొత్తానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.