ఏపీలో అక్రమార్కుల భరతం పడుతోంది వైఎస్ జగన్ సర్కార్. అదే సమయంలో ఎన్నాళ్ల నుంచో ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని బ్యాంకులకు నామం పెట్టిన వారిని సైతం భరతం పడుతోంది బ్యాంకింగ్ సెక్టార్. అంతే కదండి. ఎవరైనా నిజాయితీగా పని చేసే వారిని చూసి పక్కన వారికి కూడా ధైర్యం వస్తుంది. తాను నిజాయితీగా పని చేయాలని.. ఎదుటివారు కూడా నిజాయితీగా మలుచుకొనేలా చర్యలు తీసుకోవాలని అనిపిస్తుంటుంది. అదే బలంతో ఇప్పుడు టీడీపీ నేతలకు దెబ్బమీద దెబ్బ పడుతుంది. తాజాగా నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కు ఓ బ్యాక్ షాకిచ్చింది.

అదేమంటే.. టీడీపీ నేత.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీభరత్‌కు బ్యాంక్ షాకిచ్చింది. దాదాపు రూ.124.39కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్యాబ్యాంక్ నోటీసులు పంపించింది. రుణాల చెల్లింపు ఎగవేసిన కారణంగా భరత్‌ తండ్రి పట్టాభి రామారావుతో పాటు ఇతర కుటుంబీకుల ఆస్తుల జప్తు చేయాలని హైదరాబాద్ లోని అబిడ్స్‌ కరూర్‌ వైశ్యా బ్యాంకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులకు శ్రీభరత్ స్పందించక పోవడంతో ఏకంగా ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా టెక్నో యూనిట్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట శ్రీ భరత్ కుటుంబం గతంలో హైదరాబాద్ అబిడ్స్ బ్రాంచ్‌లో గాజువాక, భీమిలిలోని భూములు తాకట్టు పెట్టి దాదాపు రూ.124 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. అప్పటినుంచీ ఇప్పటివరకూ వడ్డీ కూడా కట్టక పోవడంతో బ్యాంకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ అప్పును 21.01.2020 నాటికి కంపెనీ పేరిట తీసుకున్న వడ్డీతో కలిపి అసలు కూడా చెల్లించాలని నోటీసులో తెలిపింది ఆ బ్యాంకు. కానీ ఇప్పుడు ఎలాంటివీ చెల్లించకపోవడంతో ఆ ఆస్తులను బ్యాంక్ జప్తు చేసేందుకు రెడీ అయింది.

అంతేకాకుండా గతంలో కూడా శ్రీభరత్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చిన విషయం తెలిసిందే. బాలయ్య చిన్నల్లుడి కుటుంబం రూ. 13 కోట్లకుపైగా బకాయి పడిందని ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. గతంలో అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపిన వాళ్లంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిలో శ్రీభరత్ కూడా విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తమ సంస్థకు ప్రభుత్వం నుంచి కొంత డబ్బు రావాలని.. తాము కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతన్నామని.. అందుకే బ్యాంకులకు డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నామని తెలిపారు. అలాగే.. తాను ప్రజల డబ్బును దొంగిలించినట్లు నిందలు వేయడం సరికాదని.. ఇలాంటి ఆరోపణలు సరికావని కూడా అన్నారు. ఇప్పుడు తాజాగా ఆస్తులు జప్తుకు రావడం అనేది మరోసారి ఆసక్తికరమైన చర్చ రాజుకుంది.