ఏపీలో రాజకీయ పార్టీల మధ్య నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయి. ఆ విధంగా ఏపీలో రాజకీయం చాలా రసవత్తరంగా మారింది. ఈ రసవత్తరమైన రాజకీయాన్ని ఏపీ ప్రజలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఏపీలో ఎంతో సీరియస్ పాలిటిక్స్ జరుగుతున్నాయి.. అంతే స్థాయిలో వెటకారం వ్యంగ్యంతో కూడిన నవ్వులాటలు కూడా కొనసాగుతున్నాయి.

తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు వరసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అదెలాగంటే.. ఈ మధ్య బాలయ్య హిందూపురం వెళ్ళినపుడు ఆయనకు నిరసన సెగ తగిలింది. రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని బాలయ్య కాన్వాయ్ ముందు నిరనసన కారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలు చేస్తున్న.. నిరసనకారులకు బాలయ్యబాబు ఆ తర్వాత గట్టిగానే కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటె.. ఇప్పుడు బాలయ్యపై వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన బాబుకు బాలయ్య బుద్ధిచెప్పాలని.. అలా చెప్పకుండా సైలెంట్ గా ఉంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని అన్నారు. రాయలసీమకు అన్యాయం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ప్రజా కోర్టులో ఓడిపోవాల్సిందేనని కూడా సెటైర్స్ వేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలయ్య సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని.. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలయ్యను తరిమికొట్టే రోజు వస్తుందని వివరించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. బాబుతో పాటూ బాలయ్య, లోకేష్‌, పవన్ కళ్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అంతేకాకుండా పెద్దలసభ అయిన శాసనమండలికి పెద్దల్ని తీసుకు రాకుండా దద్దమ్మను తీసుకొచ్చారని లోకేష్‌ గురించి పరోక్షంగా ఘాటు విమర్శనాస్త్రాలు సంధించారు రోజా. అలాగే.. లోకేష్ బాబు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని.. లోకేష్ భవిష్యత్ అయిపోయిందని.. తన రాజకీయ సమాధిని తానే తవ్వుకున్నాడని.. ఆరోపించారు. కేవలం కుమారుడి కోసమే చంద్రబాబు శాసనమండలి రద్దును అడ్డుకుంటున్నారని రోజా ఆరోపించారు. అదేవిధంగా చంద్రబాబు భజనపరులే మండలిలో ఉన్నారని.. వారు లేకున్నా ఒకటే ఉన్నా ఒకటే.. వారివల్ల ఏమీ ఒరిగేదే లేదని కూడా వెటకారాన్ని పండించారు రోజా.
ఇంకా పవన్ కళ్యాణ్‌కు జీవోల గురించి కూడా తెలియదని.. చీకటి జీవోలు అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా మూడు రాజధానులకు అనుగుణంగానే జగన్ అడుగులు వేస్తున్నారని రోజా స్పష్టం చేయడం విశేషం.