ఏపీలో శాసన మండలి రద్దు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విపక్ష పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అధికార పార్టీ నిర్ణయంపై ప్రతిపక్ష టీడీపీ మాత్రం నానాయాగీ చేస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ పాలనకు అద్దం పడుతోందని.. అసలు మండలిని రద్దు చేసే అధికారం ఆయనకు ఎవరిచ్చారని.. తీవ్ర ఒత్తిడితో టీడీపీ నేతలు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర పరిణామాలు వెలుగుచూస్తున్నాయి.

ముఖ్యంగా టీడీపీ నేతలు చెప్తున్నట్లు మండలిని రద్దు చేయమని ప్రతిపాదించే అవకాశం మాత్రమే శాసనసభకు, కేబినెట్‌కు ఉంటుందని.. మండలిని రద్దు చేసే అధికారం మాత్రం ఇక్కడి అధికార పార్టీకి లేదని వెల్లడిస్తున్నారు. ఆ అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని అంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడం, ఆమోదించకపోవడం కేంద్రం ఇష్టమని కూడా టీడీపీ నేతలు చెప్తున్న అంశంలోని సారాంశం. అయితే ఇప్పుడు అసెంబ్లీ చేసిన తీర్మానం న్యాయశాఖ ద్వారా కేంద్ర కేబినెట్‌కు వెళ్తుందని.. అది కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే.. ఆ తీర్మానం లోక్ సభకు, రాజ్య సభకు వెళ్తుందని తెలుస్తోంది. అక్కడి నుంచి రాష్ట్రపతి వద్దకు.. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాతనే నోటిఫికేషన్ తర్వాత కౌన్సిల్ రద్దవుతుందనే వినిపిస్తున్న టాక్. నడుస్తున్న చర్చ. అప్పటివరకు మండలిని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని దీని ద్వారా స్పష్టమౌతుంది. అయితే ఇంత జరిగినా.. రాష్ట్రపతి 14 రోజుల గడువుతో నోటీసు ఇచ్చిన తర్వాతే కౌన్సిల్ రద్దవుతుందని.. అప్పటి వరకూ శాసన మండలి మనుగడలోనే ఉంటూ.. యాక్టివ్ రోల్ పోషిస్తుందనేది చర్చ సాగుతుంది.

కానీ.. రాజకీయ విశ్లేషకులు మాత్రం మండలిని రద్దు చేయడం? లేదా? కొనసాగించడమనేది ఆ రాష్ట్రం ఇష్టమని దీనిపై న్యాయస్థానాలు ఎలాంటి జోక్యం చేసుకోవని కూడా వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా… ‘కేబినెట్ నిర్ణయం మేరకే మండలి రద్దుకు శాసన సభలో తీర్మానం ప్రవేశపెడితే.. మూడింట రెండొంతుల మెజార్టీతో దాన్ని ఆమోదించాలి. ఆ తర్వాత ఆ తీర్మానాన్ని గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపిస్తారు. నోడల్ ఏజెన్సీ అయిన హోం మంత్రిత్వ శాఖ లోక్ సభ, రాజ్యసభల్లో దాన్ని ప్రవేశపెట్టిన తర్వాతే.. ఉభయ సభలు సాధారణ మెజార్టీతో ఆ బిల్లును ఆమోదిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో శాసన మండలి రద్దు అవుతుంది. హోం మంత్రిత్వ శాఖ దగ్గరకు వెళ్లాక.. శాసన మండలి రద్దుకు ఎంత సమయం పడుతుందనేది చెప్పలేమని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా కేంద్రంతో రాష్ట్రప్రభుత్వానికి సంబంధాలు మంచిగా ఉంటే.. అది చాలా తక్కువ సమయమే పడుతుందని.. అసలు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదంతోనే సాగుతుండటంతో ఈ శాసన మండలి రద్దు విషయంపై కేంద్రం జోక్యం చేసుకుంటే.. చాలా తక్కువ సమయంలోనే అంతా జరిగిపోతుందనేది కూడా రాజకీయ విశ్లేషకుల భావన. కేంద్రానికి పంపిన బిల్లును.. లోక్ సభలో, రాజ్యసభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలి అనేది కేంద్రం అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. శాసన మండలిని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయలేమని కూడా వివరిస్తున్నారు. ఎందుకంటే.. గతంలో ఎన్టీఆర్ శాసన మండలి రద్దుకు సిఫారసు చేశారు. ఆ సమయంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ రాష్ట్రం వద్దంటోన్న సమయంలో.. మండలిని కొనసాగించడం బాగోదని కౌన్సిల్ రద్దుకే కేంద్రం నిర్ణయం తీసుకుందని కొందరు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మరిప్పుడు ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే..మా ప్రజాచైత్యం ఛానల్ నే చూస్తుండండి..