ఏపీలో శాసన మండలి రద్దు అంశం రాజకీయ పార్టీల్లో హీట్ పెంచుతుంది. మండలి రద్దు అంశంపై కేబినేట్ భేటీ నిర్ణయం కూడా జరిగిపోయింది. గత గురువారం జరిగిన అసెంబ్లీలో సీఎంతో పాటు మంత్రుల ప్రసంగాలు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే.. శాసన మండలి రద్దుపైనే అంతా మొగ్గు చూపినట్లు అర్ధమౌతుంది.

ఈ సమయంలో ఇప్పుడు ఏపీలో చర్చ అంతా శాసన మండలి రద్దు చుట్టే తిరుగుతోంది. మండలి రద్దుపై పలువురికి పలు అనుమానాలు కలుగుతున్నాయి. మండలి రద్దు తీర్మానం అంటే.. రాష్ట్ర అసెంబ్లీలో టు బై త్రీ మెజారిటీతో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఆ పంపించిన తీర్మానాన్ని మొదట కేంద్ర ప్రభుత్వంలోని న్యాయ శాఖ నోట్ రూపొందించి ఆ తర్వాత బిల్లు చేసి పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. పార్లమెంటు ఉభయసభలు దీనిపై చర్చించి బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపించాలి. ఆ తర్వాతే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి. ఈ తతంగం అంతా జరగడానికి కేంద్రం తలచుకుంటే.. త్వరగానే అయిపోతుంది. లేకపోతే అది ఒక వేళ ఎలాంటి సందర్భంలో అయినా పక్కన బెడితే చాలా టైం తీసుకుంటుంది అనేది ఇక్కడ అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. త్వరగా జరిగితే ఓ నెలలోనే ఈ బిల్లు ఆక్ట్ గా మారి అమలులోకి వస్తుంది. అలా జరగకపోతే ఏడాది ఆలస్యమైనా ఆశ్చర్యపోవక్కరలేదు అనే చర్చ తీవ్రంగా జరుగుతుంది.

అయితే ఏపీ సర్కార్ కు ముందున్న సవాల్ ఏమిటంటే.. ఈరోజు శాసనమండలి భవిష్యత్తును నిర్ణయించే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మండలి రద్దు ఊహాగానాల నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమైన టీడీఎల్పీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శాసన మండలిపై శాసనసభలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా తమ పార్టీ ఎమ్మెల్సీలను లాక్కోవడానికి అధికారపార్టీ ప్రయత్నిస్తోందని కూడా టీడీపీ ఆరోపించింది. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవడంతో అధికార పార్టీ ఏమాత్రం ఆలోచించకుండా మెజార్టీతో శాసన మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపుతుందనేది అందివస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

అయితే రాజ్యాంగంలో అధికరణ 169(1) ప్రకారం రద్దు ప్రతిపాదనకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇక మిగిలింది వెంటనే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించి.. ఆ తర్వాత తీర్మానం ప్రతిని కేంద్రానికి పంపనున్నారు. కాగా 2019 ఎన్నికల్లో ఓడిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా మంత్రివర్గంలో ఉన్నారు. వీరిద్దరూ కూడా గత వారం శాసన సభ సాక్షిగా.. మండలిని రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్‌ ముందు ప్రతిపాదించారు. మరిప్పుడు మండలి రద్దైతే సుభాష్ చంద్రబోస్, మోపిదేవి మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. అసలు వైఎస్ జగన్ శాసన మండలిపై ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం అసలుకే లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీకి ఏటా రూ.60 కోట్ల వరకు ఖర్చవుతుంది. తీరా గౌరవ ప్రదమైన పదవిలో కూర్చోబెట్టి వారిని అంతలా గౌరవిస్తుంటే.. తిరిగి అభివృద్ధి నిరోదక శక్తులుగా మారుతుంటే.. అలాంటి వారికి అక్కడ స్థానం ఉండకూడదనే ఇలాంటి నిర్ణయం వైఎస్ జగన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజమే మరి.