ఏపీలో శాసన మండలి రద్దు అంశం అధికార.. విపక్ష పార్టీ నేతల్లో పెద్ద దుమారం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆమోద ముద్ర వేయగానే విధాన మండలి రద్దవుతుంది. అయితే శాసన మండలిలో కీలక బిల్లులకు టీడీపీ పదే పదే అడ్డు తగులుతుండటంతో జగన్ ఈ నిర్ణయం చాలా సమర్ధవంతంగా.. ఎంతో సాహసంతో తీసుకున్నారనే చెప్పాలి. గతంలో ఎన్టీఆర్ తరహాలోనే జగన్ కూడా మండలిని రద్దు చేయడం విశేషం. అయితే మరో ఏడాదిన్నర ఆగితే.. మండలిలో వైఎస్సార్సీపీ బలం పెరుగుతుంది. కానీ జగన్ మాత్రం మండలిని రద్దు చేసేందుకే మొగ్గు చూపి అందుకు తగిన తీర్మానాన్ని కూడా చేశారు. అసలు మండలి రద్దు చేస్తే.. భవిష్యత్తులో వైఎస్సార్సీపీకే ఎక్కువ నష్టం అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది.

అయితే జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జగన్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గటం లేదు. ఇలాంటి సమయంలో శాసన మండలి రద్దుతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే విషయంపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పుడు శాసన మండలిలో దాదాపు 90 శాతం మంది తమ పార్టీకి చెందిన వాళ్ళే ఉండటంతో అదే…. శాసన మండలి రద్దు నిర్ణయానికి కారణమమని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. మండలిలో తమ ఆధిక్యాన్ని తట్టుకోలేకనే ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది వారి ప్రధాన ఆరోపణ. అయితే.. మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం వల్ల తాత్కాలికంగా ప్రతిపక్షానికి నష్టంగా కనిపించినా.. దీర్ఘకాలిక ప్రయోజనాలను గురించి ఆలోచిస్తే.. జగన్ సర్కారే ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లేదా ఇతర పదవులు పొందలేక పోయిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తుంటారు. కానీ మండలి రద్దు దిశగా జగన్ తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తుల సంఖ్య పెరుగుతుందనే భావన వ్యక్తం అవుతోంది. కానీ.. జగన్ వద్ద దీనికి విరుగుడు ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. శాసన మండలి రద్దు ద్వారా ఎమ్మెల్సీ పదవులను కోల్పోయిన వారికి, ఎమ్మెల్సీ అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్న వారికి ప్రాంతీయ మండళ్లలో సభ్యులుగా అవకాశం ఇవ్వనున్నారు. జగన్ సీఎం అయిన కొద్ది రోజులకే ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు అంశం తెర మీదకు వచ్చింది. ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షణ కోస్తా, కృష్ణా-గుంటూరు, ప్రకాశం- నెల్లూరు, సీమ వంటి ప్రాంతాలతో ఐదు మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇదే విషయాన్ని జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు కూడా తెలిపడం విశేషం.

అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాటిచ్చిన వారికి అదే హోదాతో జగన్ ప్రాంతీయ మండలి సభ్యత్వం ఇవ్వనున్నారు. ఏపీ వికేంద్రీకరణ డ్రాఫ్ట్ బిల్లు ప్రకారం.. రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ మండళ్లుగా విభజించనున్నారు. దీన్ని ఐదుకు పెంచే అవకాశముంది. ఒక్కో జోన్ కి గరిష్టంగా 9మంది సభ్యులు ఉంటారు. సీఎం ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ ప్రాంతీయ బోర్డులలో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. ఒక వైస్ చైర్మన్, ఇంకో నలుగురు సభ్యులు ఉంటారు. వైస్ ఛైర్మన్‌కు క్యాబినెట్ హోదా కల్పించి.. సభ్యులకు ఎమ్మెల్యేతో సమానమైన హోదా కల్పిస్తారు. ఈ విధంగా ఎమ్మెల్సీలు కాలేని వారికి జగన్ ప్రత్యామ్నాయం చూపించనున్నారు. నిజానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంత మండళ్లను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ ఏర్పాటు చేసిన శాసన మండలిని రద్దు చేయనున్న వైఎస్ జగన్.. తన తండ్రి ఏర్పాటు చేసిన మండళ్లను తిరిగి తెరపైకి తెస్తుండటం అనేది పార్టీ శ్రేణులకు నూతనోత్సాహాన్ని ఇచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.. ఇది నిజమే..