ఏపీలో రాజకీయాలు జోరందుకున్నాయి. వైఎస్ జగన్ సర్కార్ అధికారంలో ఎన్నో రకాల సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మూడు రాజధానుల బిల్లుపై ఏపీఐఐసీ ఛైర్మన్.. ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బిల్లు పాసైపోయిందని పెద్ద బాంబే పేల్చారు. 14 రోజుల్లోపు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో ఆ బిల్లు ఆమోదం పొందినట్లే అని ఆమె వివరించారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వాగతించారని తెలిపారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రోజా మాట్లాడుతూ.. తాజా పరిణామాలపై స్పందించారు.

అదేవిధంగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయడం సిగ్గుచేటన్నారు రోజా. మూడు రాజధానులను వ్యతిరేకించిన బాబును రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు తాపత్రయం మొత్తం రియల్ ఎస్టేట్‌పై ఉంటే.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యమని ఆమె వివరించారు.
అంతేకాకుండా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి చంద్రబాబు కొడుకు లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారని అన్నారు రోజా. అలాగే… లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తోన్న సోషల్‌ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేస్తే 80 శాతం టీడీపీ నేతలు జైల్లో ఉంటారని అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు తమ పద్దతి మార్చుకోవాలని రోజా కోరారు. ఇక మూడు రాజధానుల బిల్లుపై రగడ కొనసాగుతున్న ఈసమయంలో రోజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ బిల్లుపై శాసనమండలి ఛైర్మన్ ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ ఫైల్‌ వెనక్కు వచ్చింది. ఫైల్‌ను శాసనమండలి కార్యాలయం తిప్పి పంపింది. రూల్‌ 154 కింద కమిటీ వేయడం చెల్లదని తేల్చేసినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై శాసనమండలి కార్యదర్శిని టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు కలిశారు. మండలి ఛైర్మన్ రూల్‌ 154 కింద కమిటీ వేయాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో శాసన మండలి బిల్లును 14 రోజుల్లోపు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో ఆ బిల్లు ఆమోదం పొందినట్లేనని రోజా మాట్లాడటం సర్వత్రా చర్చినీయాంశంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.