ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ కీలక సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో దాదాపు 100 నిమిషాలసేపు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి జగన్ నివేదించారు. ఈమేరకు ఓ లేఖను కూడా ప్రధానికి అందించిన సీఎం అందులో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ యేడాది ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి రావాల్సిందిగా ప్రధానిని కోరారు సీఎం వైఎస్ జగన్. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పుభూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందని.. సంబంధిత కేంద్రమంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా కోరారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా ప్రాజెక్టుకు సంబందించిన వాటికి ఆమోదం తెలపమని కోరారు.

అదే విధంగా ప్రత్యేక హోదా కూడాచర్చించారు. అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం కోరారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని, ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించమని ప్రధానిని కోరారు.

అదేవిధంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ యేడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధానికు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు. అలాగే కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని కోరారు.

అయితే రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే… కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులునూ వెంటనే విడుదలయ్యేలా చూడాలని సీఎం కోరారు. ఇంకా వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని, రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని సీఎం కోరారు. అలాగే.. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం. ఈమేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.

అంతేకాకుండా మూడు రాజధానులపై చర్చించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధానికి వెల్లడించారు.
అయితే ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధానికి వెల్లడించారు. ఇందుకోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని తెలిపిన సీఎం.

అంతేకాకుండా శాసనమండలి రద్దు అంశాన్ని విజ్ఞాపనపత్రంలో పేర్కొన్న సీఎం. గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందన్న సీఎం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్న సీఎం. ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్‌ చేసిందన్న సీఎం. తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞప్త

చివరగా ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం –2019కు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–2019 పై అనేకమంది ప్రశంసలు తెలిపిన అంశాన్ని ప్రధానికి వివరించిన సీఎం. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.