ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. శాసన మండలి రద్దు ఎమ్మెల్యే రోజాకు కలిసి రానుందా? మంత్రి పదవి ఆశించి, భంగపడ్డ ఆమెకు మండలి రద్దు ద్వారా మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయా? అంటే అది నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో శాసనమండలి రద్దు తీర్మానం కేంద్రం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో కేబినెట్ మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేస్తారా? లేదా అన్న చర్చ కూడా తీవ్రంగా సాగుతుంది. ప్రభుత్వం మాత్రం మండలి రద్దుకు ప్రతిపాదనలు పంపడంతో అదే సభలో సభ్యులుగా ఉన్న మంత్రులిద్దరితో రాజీనామాలు చేయిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని వైఎస్ జగన్ సర్కార్ తీవ్రంగా పరిశీలిస్తోంది.

అలాగే.. మండలి రద్దు ఆలస్యం అయితే అనవసరంగా పరువు పోతుందా? అన్న అంశంపై కూడా సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. ఏపీలో శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాలపై చర్చ అందుకుంది. మండలి సభ్యులుగా ఉన్న బోస్, మోపిదేవితో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని వైసీపీ పెద్దలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతుంది. మండలి రద్దుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఇద్దరు మంత్రులు కొనసాగడం నైతికంగా సర్కార్ అంత మంచిది కాదని.. ఈ విషయంలో వైఎస్ జగన్ చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని కూడా గత పరిణామాలను బట్టి తెలుస్తున్న సత్యం.

అదేవిధంగా అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఇద్దరు మంత్రులు కూడా తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. దీంతో తమ రాజీనామాలపై నిర్ణయాన్ని సీఎం జగన్ చేతిలోనే పెట్టినట్లయింది. అయితే ప్రభుత్వం మాత్రం మండలి సభ్యులైన మంత్రులతో రాజీనామాలు చేయిస్తే తలెత్తే పరిణామాలపై ఆరా తీస్తోంది. అటు.. వీరిద్దరు రాజీనామా చేస్తే ఎమ్మెల్యే రోజాకు పదవి దక్కే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వాస్తవానికి ఆమెకు తొలి మంత్రివర్గంలోనే పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ.. రోజాకు పదవి దక్కలేదు. ఆ తర్వాత ఆమెకు ఏపీఐఐసీ పదవిని కట్టబెట్టారు. ఆ పదవితో ఆమె అంత సంతృప్తి చెందకపోయినా.. సీఎం జగన్‌పై ఉన్న విశ్వాసంతో ఆమె సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తే.. ఆ పదవుల్లో రోజాకు ఛాన్స్ ఉంటుందని.. సీఎం జగన్ కూడా ఆమెకు పదవి ఇవ్వడంపై ఇప్పటికే దృష్టి సారించారని కూడా సమాచారం అందుతుంది. అదే సమయంలో రోజాకు మంత్రిపదవి ఇచ్చి ఆమె వద్ద ఉన్న ఏపీఐఐసీని సుభాష్ చంద్రబోస్ కు కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.