జనసేన పార్టీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లేఖ ద్వారా తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ సినిమాల్లో నటించనంటూ పలు సందర్భాల్లో ప్రకటించారని.. కానీ.. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నారని.. మీ విధానాల్లో స్థిరత్వం లేదని తెలిపారు. అలాగే.. లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ లేఖలో అంతా ఆశ్చర్యపోయేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఘాటు వివరణ ఇచ్చారు. అదేమంటే.. “లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నాం… ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాం” అని పేర్కొన్న పవన్.. ఆయన లేవనెత్తిన అంశాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అదీ ఎలాగంటే.. “నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అలాగే.. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. లక్ష్మీనారాయణ… జనసేన పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు.” అంటూ ప్రకటన ద్వారా భలే పంచ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. అయితే ఇప్పడు లక్ష్మీనారాయణ ఏం చేయబోతున్నారు. ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. మొన్న జరిగిన ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన తర్వాత నుంచి ఆయన జనసేనకు రాజీనామాచేస్తారని ప్రచారం జరిగుతూ వస్తుంది కానీ.. ఆ వాదనను లక్ష్మీనారాయణ ఖండించారు. ఓ దశలో పవన్ కళ్యాణ్, లక్ష్మీనారాయణ మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరూ కలసి విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జనసైనికుల సమావేశంలో ఒకే వేదికను పంచుకున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్ ఇవ్వాలని కూడా పిలుపునిచ్చారు. అయితే.. ఇంతలోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

కానీ.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున లక్ష్మీనారాయణ పోటీ చేశారు. అయితే.. అక్కడ వైసీపీ విజయం సాధించింది. సుమారు 2,88,874 ఓట్లతో లక్ష్మీనారాయణ మూడోస్థానంలో నిలిచారు. జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయడానికి తాజాగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కారణమనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల బీజేపీతో కలసి ముందుకు నడవాలని నిర్ణయించారు. ఎలాంటి కండిషన్లు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించారు. దీంతో ఇదే విషయంలో లక్ష్మీనారాయణకు మండినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదెలాగంటే.. ఇప్పటికే బీజేపీలో విశాఖ సీటు మీద ఆశలు పెట్టుకున్నవారు చాలా మందే ఉన్నారు. 2014లో అక్కడ బీజేపీ నుంచి హరిబాబు గెలిచారు. అంతకు ముందు కాంగ్రెస్ తరఫున పురందేశ్వరి విజయం సాధించారు. ప్రస్తుతం పురందేశ్వరి బీజేపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆమె విశాఖ నుంచే పోటీ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విశాఖ సీటు జనసేనకే వస్తుందనే గ్యారెంటీ ఏమాత్రం లేదు. ఒకవేళ ఇప్పుడు ఎంత కష్టపడి పనిచేసి క్యాడర్‌ను బిల్డప్ చేసుకున్నా చివరకు పొత్తుల పేరు చెప్పి విశాఖ సీటు బీజేపీ తీసుకుంటే అప్పుడు లక్ష్మీనారాయణ పరిస్థితి ఏంటి? అప్పటికప్పుడు మరో సీటు ఇస్తామంటే సీన్ ఎలా ఉంటుందో తెలీదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతే లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం అందుతుంది. అంతేకాకుండా పవన్ కల్యాణ్.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి ఇమేజ్ ఉన్న నేతను సరిగ్గా వాడుకోవడం లేదని.. తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే టాక్ కూడ ఉంది. ఇది కూడా లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడానికి కారణం కావచ్చు. మొత్తానికి కోల్డ్ వార్ అనేది ఎంతో కాలం నిలవదు. అదీ ఎప్పుడో ఒకప్పుడు బరెస్ట్ కావాల్సిందే. ఇప్పుడు అంతా కూల్. జనసేనకు మాత్రం హీట్. చూద్దాం పవన్ పయనం రాజకీయాల్లో ఎలా నడుస్తుందో. పవన్ పోకడలను అవకాశంగా మలుచుకుంటున్న లక్ష్మీనారాయణ డైరెక్ట్ గా బీజేపీతోనే తేల్చుంకుందాం అంటూ ఆ పార్టీలో చేరే అవకాశాలే మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం.