ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మూడు రాజధానుల పనులు చాలా చకచకా సాగుతున్నాయి. పరిపాలన రాజధాని కోసం విశాఖలో ఏర్పాట్లు చాలా సైలెంట్ గా జరిగిపోతున్నాయి. మూడు రాజధానుల బిల్లులకు సెలెక్ట్ కమిటీ పేరుతో.. కేంద్ర తీర్మానాలు అమలు వంటివాటితో బ్రేకులు పడినప్పటికీ అధికారులు మాత్రం విశాఖలో అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఇప్పటికే మిలీనియం టవర్స్ లో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇపుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం గెస్ట్ హౌస్ ను ఖరారు చేస్తున్నట్లు అంతర్గతంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

అందులో భాగంగా విశాఖపట్టణం నగరం నడిబొడ్డున ఉన్న పోర్ట్ గెస్ట్ హౌస్ అన్ని రకాలుగా అనువుగా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోనే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వస్తుందని సర్వత్రా టాక్ వినిపిస్తోంది. అలాగే.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాప్టిల్ ప్రతిపాదించడంతో భవనాల వెతుకులాట చర్యలు ముమ్మురంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం నివాసానికి సంబంధించి సిరిపురం జంక్షన్ కు బీచ్ రోడ్డుకు సమీపంలో ఉన్న పోర్టు ట్రస్టు అనువైన ప్రాంతంగా అధికారులు పరిశీలించి దానిని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే భద్రతా పరంగా కూడా ఈ ప్రాంతం అత్యంత కట్టు దిట్టమైన ప్రాంతంగా ఉంటుందని వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇంకా ఆ ప్రదేశం ఎటు నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా అన్నింటికీ అనుకూలంగా మధ్యలో ఉంటుంది. అలాగే.. ఆ ప్రాంతమంతా చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. అందుకే ఆ ప్రాంతం సీఎం నివాసానికి అనువుగా ఉంటుందని అధికారులు కూడా భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతం 20 ఎకరాల విస్తీర్ణంలో ఉండి అన్ని వసతులు అందుబాటులో ఉన్న కారణంగా సిరిపురం జంక్షన్ కు బీచ్ రోడ్డుకు సమీపంలో ఉన్న పోర్టు ట్రస్టును సీఎం వైఎస్ జగన్ నివాసానికి ఎంపిక చేసుకున్నట్లు సమాచారం అందుతుంది.