ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా చురుకుగా పాలన చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్లలో చేయలేని పనులను సైతం ఎంతో తెగువతో సాహసంతో పరిష్కరించుకుంటూ దూసుకుపోతున్నారు. జెట్ స్పీడ్ లో పాలన చేస్తూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే ఎన్నో సాహసోపేతమైన బిల్లులను తెచ్చారు. ఎన్నో పాలసీలను రూపొందించారు. ఐదేళ్లు తమకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వరంగా భావించి ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి వసూలు చేసిన సంపదను ప్రజలకు సమానంగా పంచాలని వికేంద్రీకరణ దిశగా అడుగులు వేశారు. అందుకోసం అడ్డు వచ్చిన శాసన మండలిని రద్దు చేసి పార్లమెంట్ కు బిల్లును పంపారు.

అయితే ఇప్పుడు చెప్పవచ్చేది ఏమిటంటే.. ఏపీ అసెంబ్లీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రం తప్పుకుండా ఓకే చేయబోతున్నట్లు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. తాజాగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. సుపరిపాలన దిశగా శాసనమండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని వెల్లడించారు. శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని వివరించారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి ఎంతమాత్రం లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు.

అంతేకాకుండా మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడటం లేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారమే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఆలస్యం చేయడం, తొందరగా పూర్తి చేయడం వంటివేవీ ఉండబోవని వెల్లడించారు. మండలి రద్దు తీర్మానాన్ని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన లేదని ఆయన తెలిపారు. వ్యవస్థకు లోబడే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. 169 (1) ప్రకారం అసెంబ్లీ.. తీర్మానం చేస్తే దాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇందులో తాము చేసేదేమీ ఉండదని జీవీఎల్ అన్నారు. అయితే కొందరు కావాలనే కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తామని జీవీఎల్ వివరించారు. ఈ విషయంలో తమ పార్టీకి మంచి జరుగుతుందనో.. చెడు జరుగుతుందనో చూడటం లేదని.. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం అడుగులు వేస్తుందని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.