ఏపీ అభివృద్ధి విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా అన్నింటినీ పరిష్కరించుకొంటూ ముందుకు దూసుకుపోతుంది వైఎస్ జగన్ సర్కార్. మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే అంశంపై వివాదం నెలకొన్న ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు బిల్లులను శాసన మండలిలో ప్రవేశపెట్టారు. అయితే అక్కడ అనుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలేసరికి శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. దీనిపై అన్నింటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో మూడు రాజధానుల అంశాన్ని జాప్యం చేయకుండా ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేయడం వైసీపీ వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తోంది.

అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన ప్రారంభమైన శాసన సభ సమావేశాలు కొంత బ్రేక్ తర్వాత జనవరి 20వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు కొనసాగాయి. జనవరిలో జరిగిన సెక్షన్ లోనే జగన్ ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే అసెంబ్లీలో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందగా కౌన్సిల్ కు వచ్చే సరికి ప్రభుత్వానికి చుక్కెదురైంది. టిడిపికి ఉన్న ఆధిపత్యాన్ని కౌన్సిల్ వ్యూహాత్మకంగా వాడుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లునూ కౌన్సిల్ తిప్పి పంపడంతో అసెంబ్లీ సమావేశాలను రెండ్రోజులు పొడిగించి మరి కౌన్సిల్ రద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తాజాగా అసెంబ్లీ మండలి ప్రొరోగ్ చేయటంలో ప్రభుత్వం రెండు అంశాలలో వెసులు బాటును కల్పించినట్లయ్యింది. కౌన్సిల్ తిరస్కరించిన రాజధానుల బిల్లునూ ఆర్డినెన్స్ రూపంలో తీసుకు వచ్చి దానికి అనుగుణంగా జగన్ ప్రభుత్వం రాజధాని తరలింపుపై ముందడుగు వేసే వెసులుబాటు కలుగుతుంది.

అదే సమయంలో ప్రోరోగ్ చేయకుండా ఉంటే త్వరలో జరిగే బడ్జెట్ సెషన్ లో గతంలో గవర్నర్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం శాసన మండలి కూడా సమావేశ పరచాల్సి వచ్చేది. తాజగా ప్రొరోగ్ చేసిన నేపథ్యంలో బడ్జెట్ సెషన్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ లో కేవలం శాసన సభను మాత్రమే నోటిఫై చేసే అవకాశముంది. తద్వారా మండలి మనుగడలో లేదని చాటినట్లవుతుంది. మరోవైపు వికేంద్రీకరణ ఆర్డినెన్సు బిల్లుల పై ఈ నెల 25న హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో కోర్టులో ఉన్న అంశంపై ఆర్డినెన్స్ సరికాదంటూ ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. బడ్జెట్ సెషన్స్ లో బిల్లులూ మళ్లీ సభకు రావాల్సిందేనంటుంది టిడిపి. దీనిపై ఇప్పటివరకు శాసనమండలి సెలక్ట్ కమిటీ వేయకపోవడంతో ఇక మూడు రాజధానుల తీర్మానం పాసై పోయినట్లేనంటోంది అధికార వైసీపీ సర్కార్. దీంతో ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.