ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన్ను ఏపీకి పంపేందుకు కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. తాజాగా కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతో అందుకు కేంద్రం.. సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తెలంగాణ నుంచి ఏపీకి రానున్నారని కూడా టాక్ నడుస్తోంది. అయితే స్పీఫెన్ రవీంద్రకు ఇంటిలిజెన్స్ చీఫ్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

అయితే 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇంటిలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ పట్టుబడుతున్నారు. అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో కూడా చర్చించారు. కేసీఆర్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవీంద్రను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి.. డిప్యుటేషన్‌పై ఏపీకి తీసుకెళ్లే ప్రయత్నాలు తెలిసిందే.

అదే సమయంలో స్టీఫెన్ రవీంద్ర అమరావతిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. దీంతో స్టీఫెన్ రవీంద్ర ఏపీకి రావడం ఖాయమని అంతా భావించారు. కానీ కేంద్రం నుంచి అప్పుడు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాలు తత్కాళికంగా ఆగిపోయాయి. దీంతో కుమార్ విశ్వజిత్‌కు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనే నిఘా విభాగం బాధ్యతల్ని చూసుకుంటున్నారు. అలాగే.. డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఇంటిలిజెన్స్ చీఫ్‌‌ను నియమించింది. ఏపీఎస్ అధికారి మనీష్‌కుమార్ సిన్హాకు ఆ బాధ్యతలు అప్పగించారు. అప్పటికి ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న విశ్వజిత్ స్థానంలో సిన్హాను నియమించారు. మనీష్ కుమార్ 2000 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయనే ఇంటిలిజెన్స్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.

కాగా 1990 బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర.. సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయనకు ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. రాయలసీమలో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వత ఆయన తెలంగాణకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ రేంజ్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తెలంగాణలో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర ఇంఛార్జ్‌ ‌గా వ్యవహరించడం విశేషం. మంచి పేరున్న అధికారిగా వైఎస్ జగన్ ఆయన్ను పట్టుబట్టి మరీ ఇష్టంగా తీసుకెళ్లడంపై అధికారులు కూడా గర్వంగా ఫీలౌతుండటం విశేషం.