అమరావతి : జగన్ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంధించిన వ్యంగ్యాస్త్రాలు నవ్వులు పూయిస్తున్నాయి. ‘ఓలి రాంగోలి’ అంటూ ఆయన చేసిన ట్వీట్ జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. పాలన మొత్తం రంగులమయమైందని.. రంగుల జలగం అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హోలీ సందర్భంగా జంపండు రంగుల పథకం ప్రారంభమైందంటూ సెటైర్ వేశారు.

ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే ‘‘రాష్ట్రంలో జలగం ప్రవేశ పెట్టిన రంగులు మూడు.. అవి నీలం, తెలుపు, ఆకుపచ్చ. ఈ రంగులు జలగన్న కార్యాలయాల్లో వలంటీర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. దీనికి జాంపండు రంగులు పథకం అని నామకరణం చేశారు. దీనికి అట్టహాసంగా 151 మంది కళాకారులతో శ్రీ జంపండు గారు ప్రారంభిస్తారు. ముందుగా ఏ2 వెలగపండు గారు.. ఏ1 జాంపండు గారికి మూడు రంగులు పూసి ప్రారంభిస్తారు. ఈ రంగులు స్వచ్ఛమైన అవినీతి మరకలకి ప్రసిద్ధి. దీనిని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పూసి ఆనందించాలని జాంపండు అలియాస్ జలగం కంకణం కట్టుకున్నారు. మొత్తానికి రంగు పడింది అని జనాలు అనుకుంటున్నారు’’. కలర్స్ సీఎం, ఫెయిల్డ్ సీఎం జగన్ హ్యాష్ ట్యాగ్‌లతో ఈ ట్వీట్ చేశారు.