మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్లు చేశారు. భారత్‌కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో గొప్ప భవిష్యత్తు ఉంటుందని జ్యోతిరాదిత్య భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఎన్డీఏ పాలనలో బ్యాంకులు కుప్పకూలుతున్నాయని, రూపాయి మారకం విలువ పతనమవుతోందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకుందని, సామాజిక వ్యవస్థ నాశనమవుతోందని ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ, అమిత్ షాల నేతృత్వంలో దేశానికి మంచి భవిష్యత్తు ఉందని జ్యోతిరాదిత్య భావిస్తున్నారని చురకలంటించారు.

కేంద్ర మంత్రిగా అమిత్ షాను లేక నిర్మల సీతారామన్‌ను తొలగించి ఆ స్థానంలో జ్యోతిరాదిత్యను నియమించాలని ఆయన అన్నారు. వారిద్దరు చేసే పనిని ఆయన కచ్చితంగా వారి కన్నా మెరుగ్గా చేస్తారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చివరగా ‘మహారాజా.. మీకు మా శుభాకాంక్షలు’ అని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.