ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసింది వీటిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి కేంద్ర మంత్రులు వారి సర్టిఫికెట్లను చూపించాలి జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)లకు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఢిల్లీ అసెంబ్లీ నిన్న ఆమోదించింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ మొత్తం 70 మంది ఎమ్మెల్యేలలో 61 మందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని చెప్పారు. దేశ రాజధానిలో ఎన్పీఆర్, ఎన్నార్సీలను అమలు చేయకూడదని అసెంబ్లీ తీర్మానించిందని తెలిపారు. యావత్ దేశానికి ఇది అతి పెద్ద సందేశమని అన్నారు.

తనతో పాటు తన భార్యకు, తమ కేబినెట్ సభ్యులకు కూడా బర్త్ సర్టిఫికెట్లు లేవని కేజ్రీవాల్ చెప్పారు. బర్త్ సర్టిఫికెట్లు లేకుండా తమ జాతీయతను ఎలా నిరూపించుకోగలమని ప్రశ్నించారు. తామంతా నిర్బంధ కేంద్రాలకు వెళ్లాల్సిందేనా? అని అడిగారు. ఎన్పీఆర్, ఎన్నార్సీలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. కేంద్ర మంత్రులు వారి సర్టిఫికెట్లను చూపించాలని సవాల్ విసిరారు.