నితీశ్‌పై రేణిగుంట వైసీపీ నేతల దాడి పోలీసు వాహనం నుంచి దూకేసిన నితీశ్ ఏర్పేడు వెళ్తే తనను బతకనివ్వరని వాపోయిన జనసేన నేత. చిత్తూరు జిల్లా ఏర్పేడు జడ్పీటీసీ అభ్యర్థి నితీశ్‌పై రేణిగుంట వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన రేణిగుంట పోలీసులు ఆయనను ఏర్పేడు తరలించేందుకు ప్రయత్నించగా వెళ్లేందుకు నితీశ్ నిరాకరించారు. తాను ఏర్పేడు వెళ్తే వైసీపీ నేతలు బతకనివ్వరని, తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని చెబుతూ పోలీసు వాహనం నుంచి దూకేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు జనసేన రాష్ట్ర సమన్వయకర్త పసుపులేటి హరిప్రసాద్, పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు బొలిశెట్టి సత్యలను అరెస్ట్ చేశారు. ఇది మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. వారి అరెస్ట్‌ను జనసేన నేతలు ఖండించారు. వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జడ్పీటీసీ నామినేషన్‌ను ఉపసంహరించుకోనందుకే తమపై కక్ష సాధిస్తున్నారని హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.