కరోనా దేశంలో ఇంతగా విస్తరిస్తుంటే ఏపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని  తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా జనసాంధ్రత భారత్‌లోనే అధికమన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘‘దేశంలో ఇప్పటికే అనేక విమానాలు, రైళ్లు రద్దు చేశారు. విదేశాల నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులను ఇళ్లల్లోనే ఉంచారు. ఎక్కడికక్కడ థర్మల్‌ స్కానర్లు, శానిటైజర్లు ఏర్పాటు చేశారు. దేశంలో అనేక రాష్ట్రాలకు క్రమంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌కు ఇప్పటివరకు మందులు కూడా లేవు. ఇప్పటికప్పుడు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు మరో నాలుగైదు నెలల పాటు పరిశీలించాలని చెబుతున్నారు. విమానాలు రద్దుచేయడంతో మనవాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో కేసులు పెరుగుతున్నాయి.  ఇక్కడ ఏమాత్రం కట్టడి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో కేసులు ఉన్నా కావాలని దాస్తున్నారు. దేశంలో కరోనా విస్తరణ వల్లే స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్ణయం తీసుకుంటే.. సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారు? ఏయే ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కడైనా క్వారంటైన్‌ ఏర్పాటు చేసిందా? కరోనా స్క్రీనింగ్‌ టెస్ట్‌లు ఎక్కడ చేస్తున్నారు? మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజర్లను కార్యాలయాల్లో ఏర్పాటు చేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.