ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి మరోక్షంగా విమర్శలు గుప్పించారు. సీఎం స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడడం బాధాకరమని సుజన అన్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సినా బాధ్యతారహితంగా మాట్లాడారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఇష్టానుసారం మాట్లాడారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల అధికారిపై హైకోర్టు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు వచ్చారని సుజనాచౌదరి మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కన్నా ఎన్నికలే ముఖ్యం అనేలా ప్రభుత్వ తీరు ఉందని, ఎన్నికల అధికారికి కులాన్ని అంటకట్టడం మంచిది కాదని సుజనాచౌదరి సూచించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా కులం ఆపాదించేలా ఉన్నారని, బీజేపీ, టీడీపీ నాయకులపై దాడులు చేశారని సుజనాచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమ, బుద్దా వెంకన్నపై దాడి హత్యాయత్నమేనని సుజనా పేర్కొన్నారు. ఏకగ్రీవం అయిన చోట్ల మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, కన్నాపై వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని సుజన అన్నారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులను కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని సుజనాచౌదరి విమర్శించారు.