మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కేసు విషయంలో హైకోర్ట్ లో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. సంఘటన జరిగిన ప్రదేశంలో పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్ట్ ఈ సందర్భంగా తూర్పారబట్టింది. దర్యాప్తులోని లోపాల్ని హైకోర్ట్ ఎత్తిచూపింది. హత్య గురించి తెలుసుకున్న పనివారు, తెలిసినవారు, సీఐ శంకరయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారని, వారిలో ఎక్కువ మంది విద్యావంతులు ఉన్నారని అన్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు చెడిపోకుండా శవాన్ని కదల్చకుండా చూడాల్సింది పోయి,
కొందరి స్వార్థ ప్రయోజనం కోసం స్నానాల గది నుంచి పడక గదికి మార్చారన్నారు. రక్తాన్ని తుడిచి బ్యాండేజీ వేశారని, రక్తపు మడుగును పూర్తిగా శుభ్రం చేశారన్నారు. హత్యకు సంబంధించిన ముఖ్యమైన సాక్ష్యాల్ని చెరిపేశారన్నారు. నేరస్థలంలో సాక్ష్యాల్ని కాపాడేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదన్న కోర్ట్… ఈ తీరు పోలీసులు, అక్కడున్న వ్యక్తుల తప్పిదాన్ని స్పష్టం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్ట్. నేర స్థలంలో శవ పంచనామా నిర్వహించకుండా పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి చేయడం చిన్న విషయం కాదని,

ఘటన జరిగిన చోటే శవ పంచనామా నిర్వహించాలని వ్యాఖ్యానించారు. క్లూస్‌ టీం వచ్చి ఆధారాలను సేకరించాలని, అందుకు భిన్నంగా కొందరు స్వార్థపరులు ఉద్దేశపూర్వకంగా కీలక సాక్ష్యాల్ని కనిపించనీయకుండా చేశారని కోర్ట్ మండిపడింది. ఆర్థిక, వ్యక్తిగత, రాజకీయ సంబంధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, పలువురిని విచారించామని సిట్‌ చెబుతున్నప్పటికీ, ఇప్పటి వరకూ హత్య ఘటనతో నేరుగా సంబంధం ఉన్న ఒక్కరినీ కనుగొనలేదని కోర్ట్ ప్రస్తావించింది. వివేకా కేసులో అనుమానితునిగా భావిస్తున్న కె శ్రీనివాసరెడ్డి వాస్తవంగా తనకు తానుగా చనిపోయాడా? లేక వాస్తవాలు బయటకు రాకుండా అతడిని తప్పించారా? అనే విషయం వెల్లడి కావాల్సి ఉందని కోర్ట్ వ్యాఖ్యానించడం గమనార్హం.