రోగులు, విద్యార్థులు, దివ్యాంగులకు మినహాయింపు

హైదరాబాద్‌ : రైళ్లలో వివిధ వర్గాలవారి రాయితీలను తాత్కాలికంగా నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనవసర ప్రయాణాలను కట్టడి చేయడానికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తిరిగి ప్రకటించే వరకు రాయితీలు ఉండబోవని స్పష్టం చేసింది. 53 రకాల రాయితీల్లో మొత్తంగా 15 రకాలను మాత్రమే ఇప్పుడు వాడుకునే వీలుంటుందని స్పష్టం చేసింది. 20వ తేదీ లోపు టికెట్లు తీసుకున్నవారు వాటిని రద్దు చేసుకుంటే టికెట్‌ రద్దు రుసుమును వసూలు చేయరు. రాయితీతో ముందే తీసుకున్న టికెట్‌పై ప్రయాణం చేస్తే మిగిలిన ఛార్జీని వసూలు చేయరు. విద్యార్థులు, దివ్యాంగుల్లో కలిపి నాలుగు విభాగాల వారికి, మరో 11 రకాల రోగులకు మాత్రం రాయితీలు కొనసాగుతాయని రైల్వేశాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

రైల్వేశాఖ సూచనలు

* స్టేషన్లలో, రైళ్లలో తోటి ప్రయాణికుల మధ్య తగినంత దూరాన్ని పాటించాలి.
* రైల్వే పరిసరాల్లో ఉమ్మి వేయరాదు.
* ప్రయాణ సమయంలో జ్వరం వస్తే రైల్వే సిబ్బందిని సంప్రదించాలి. ప్రయాణానికి ముందే జ్వరాన్ని పరీక్షించుకోవాలి.
మరో 84 రైళ్లు రద్దు
మరో 84 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి 31 వరకు ఇవి నడవవు. వీటితో కలిపి రద్దయిన మొత్తం రైళ్ల సంఖ్య 168కి చేరింది. పూర్తి డబ్బును ప్రయాణికులందరికీ వాపసు చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.