భారత్‌ సహా ప్రపంచంలోని చాలాదేశాల్లో ప్రస్తుతం పంటలు నూర్పిడి కాలం. మరోవైపు కరోనా కష్టాలతో జనం మొత్తం ఇండ్లలోనే ఉండిపోయారు. దాంతో పంట కోతలకు కూలీలు దొరక్క కోట్ల ఎకరాల్లో పంటలు పొలాల్లోనే ఉండిపోయాయి. దాంతో చేతికొచ్చిన పంటలు నేలపాలు అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడిన కోట్లమంది ఆకలితో అలమటించటం ఖాయమనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా లాక్‌డౌన్‌ ఎంతకాలం కొనసాగుతుందోనన్న భయాలతో ఇప్పటికే జనం అవసరానికి మించి ఆహార పదార్థాలు కొని నిల్వ చేసుకుంటున్నారు. దాంతో మార్కెట్లో బియ్యం, గోధుమలు ఇతర పదార్థాలకు చాలా చోట్ల కొరత ఏర్పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నగరాల్లో సూపర్‌ మార్కెట్లన్నీ ఖాళీ అవుతున్నాయి. ఈ పరిస్థితి చిన్న పట్టణాల నుంచి గ్రామాలకు కూడా పాకే ప్రమాదం కనిపిస్తున్నది. మాంసం, డెయిరీ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు తదితర నిత్యావసరాలు మార్కెట్లకు తరలించేందుకు ఉత్పత్తిదారులు నానా కష్టాలు పడుతుండగా, వినియోగదారులు అవి దొరక్క అంతే కష్టపడుతున్నారు. ఇప్పటికైతే నిత్యావసరాలకు ఎలాంటి కొరత లేదని అధికారులు అంటున్నారు. అమెరికా, యూరప్‌ ఖండాల్లో ఆహార పదార్థాల ఉత్పత్తి సంస్థలు సాధారణంకంటే ఎక్కువ సమయం నడిపిస్తూ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నారు.

వాయు, జల రవాణా పూర్తిగా స్థంభించటంతో ఆఫ్రికా నుంచి యూరప్‌కు కూరగాయల రవాణా, దక్షిణ అమెరికా నుంచి ఉత్తర అమెరికాకు పండ్ల రవాణా పూర్తిగా ఆగిపోయింది. కూలీలు దొరకక పండ్లన్నీ చెట్లపైనే పాడయ్యే పరిస్తితి వచ్చింది. భారత్‌లో ఇప్పడు మామిడి పండ్లు, ద్రాక్ష సీజన్‌. కానీ పండ్లు కోసేందుకు కూలీలు దొరకటంలేదు. వరి, గోధుమ వంటి పంటలను హార్వెస్టర్లతో నూర్పిడి చేయవచ్చు. కానీ పండ్ల తోటలకు కచ్చితంగా కూలీలు కావాలి. దాంతో పండ్లతోటల రైతులు ఆందోళలో ఉన్నారు. పరిస్తితుల్లో వీలైనంత త్వరగా మార్పు రాకుంటే ఆహార పదార్థాలకు కొరత ఏర్పడి ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.