కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తమ దేశంలోని పేదవారిని ఆదుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల చివరి వారంలో 2 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాదికి 75 వేల డాలర్ల ఆదాయంలోపు ఉన్న ప్రతి ఒక్కరికి అమెరికా ప్రభుత్వం రూ.93 వేలు (1200 డాలర్లు) ఇవ్వనుంది. అంతేకాదు, పిల్లలకు రూ.38 వేలు (500 డాలర్లు) ఇవ్వనున్నారు.

ఈ మేరకు ట్రంప్‌ సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది. అమెరికాలోని సంస్థల్లో ప్రజలు ఉద్యోగాలు కోల్పోకుండా ఆయా సంస్థలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రజలకు ఇవ్వనున్న చెక్కులన్నింటిపై తన సంతకం ఉండాలని ట్రంప్‌ ఆదేశించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇది ట్రంప్ వేస్తోన్న కొత్త ఎత్తుగడ అని, దీని వల్ల పేదలకు డబ్బు అందడంలో ఆలస్యమవుతోందని మండిపడుతున్నారు.

ప్రజలకు డబ్బు అందించేందుకు సంబంధింత శాఖ ఉద్దీపన ప్యాకేజీ కింద ఇస్తోన్న అన్ని చెక్కులపై ట్రంప్‌ పేరును ముద్రించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. లక్షలాది మంది ప్రజలకు త్వరలోనే ఈ చెక్కులు అందనున్నాయి. చెక్కులకి ఎడమ వైపు ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ జె.ట్రంప్ పేరు ఉంటుందని వాషింగ్టన్‌ పోస్ట్ తెలిపింది.

ఉద్దీపన కింద ఇచ్చే నిధుల చెక్కులపై అమెరికా ప్రభుత్వం ఇలా అధ్యక్షుడి పేరును ముద్రిస్తుండడం ఇదే తొలిసారి. ఇందుకోసం కంప్యూటర్‌ కోడ్‌లో తప్పనిసరిగా మార్పులు చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ఇలా చాలా ఆలస్యంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల బాధితులకు ఇచ్చే నిధులు ఆలస్యంగా వెళ్లే అవకాశం ఉంటుందని విమర్శలు వస్తున్నాయి.

దాదాపు 150 మిలియన్ల మంది ఈ నిధులు అందుకోనున్నారు. చెక్కులపై ట్రంప్‌ పేరు ముద్రిస్తుండడం పట్ల రాజకీయ పరంగానూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతోనే ట్రంప్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. తన కీర్తిని పెంచుకోవడానికే ట్రంప్ ఇలా చెక్కులపై తన పేరును రాయించుకుంటున్నారని అంటున్నారు.

‘మీ డబ్బుని మీరు పొందడంలో ఆలస్యం జరుగుతోంది. ఎందుకంటే మీకు డబ్బు అందడం కంటే చెక్కులపై తన పేరు ఉండడం చాలా ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ భావిస్తున్నారు’ అని డెమోక్రాటిక్‌ సెనేటర్ బ్రియాన్ స్కాట్చ్‌ విమర్శించారు. కాగా, అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య ఆరు లక్షలకు పైగా చేరింది. ప్రతి రోజు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో 28 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.