తలాపునే కృష్ణా నది.. కానీ తాగేందుకు నీరు లేని రాయలసీమ దుస్థితి.. అవును ఆంధ్రప్రదేశ్ లో నదీజలాల వాటాలో అత్యంత అన్యాయం జరిగింది ఎవరికైనా అంటే అది ఖచ్చితంగా రాయలసీమకే. ఎందుకంటే రాయలసీమలోని కర్నూలు జిల్లా మీదుగానే కృష్ణా నది పోతుంది. వానాాకాలంలో భారీ వరదలు వచ్చి వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంది. కానీ ఆ వరద జలాలను కూడా సద్వినియోగించుకోలేని దుస్థితి సీమ వాసులదీ. ఉమ్మడి ఏపీలో.. ఇప్పుడు అవిభాజ్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులంతా రాయలసీమ వారే.. కానీ వారి సొంత ప్రాంతం కరువుతో నెర్రలు బారుతున్నా ఆ కృష్ణమ్మను ఆ బీడువారిన పొలాల్లోకి మళ్లించలేని దైన్యం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక్కరు వచ్చారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ వాసిగా.. ఆ ప్రాంతం కరువు కాటకాలు ప్రత్యక్షంగా చూసిన నేతగా సీమను సస్యశ్యామలం చేసే గురుతర బాధ్యతను తలకెత్తుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలలో ఒకటైన కాళేశ్వరంకు ధీటుగా  రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్.ఎల్.సి– రాయలసీమ లిప్ట్ స్కీమ్)ను ఏర్పాటు చేయబోతున్నారు. సీమ కరువు తీరేలా శ్రీశైలం జలాలను మళ్లించనున్నారు. రోజుకు 3 టీఎంసీల వరకు కృష్ణా నదీ వరద జలాలను మళ్లించే ఈ అద్భుత పథకాన్ని ప్రారంభించబోతున్నారు.

ఉమ్మడి ఏపీలో కరువుతో అల్లాడే సీమ జిల్లాలకు నీళ్లందించాలని నాడు డా. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంతో పాటు హంద్రీ – నీవా, గాలేరు నగర లాంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు తోడ్పడే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపడుతున్నారు. అంతరాష్ట్ర వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిచే దశకు చకచకా చేరుకుంది.

ఏపి చరిత్రలోనే అరుదైన ప్రాజెక్ట్ ఇదీ..

రాయలసీమలోనే కాదు రాష్ర్టంలోనే ఇంతపెద్ద ఎత్తపోతల పథకం ఎవరూ  నిర్మించనే లేదు. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రపంచంలోనే పెద్దదైన బహుళ, భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం 2 టిఎంసీల పంపింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఇప్పుడు మరో టిఎంసి సామర్థ్యం విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న రాయలసీమ పథకం కూడా అంతే సామర్థ్యంతో చేపడుతున్నారు. రోజుకు 3 టిఎంసీల నీటిని పంపింగ్ చేసేలా తీర్చిదిద్దారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంత పెద్ద పంపింగ్ ప్రాజెక్ట్ నిర్మించనే లేదు. ఏపీలో అతిపెద్దదిగా భావించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం మొత్తం ఏడాది పంపింగ్ సామర్థ్యం 40 టిఎంసీలు మాత్రమే. అదే విధంగా పట్టిసీమ, ముచ్చుమర్రి, కొండవీటి వాగు, పురుషోత్తపట్నం లాంటి ఎత్తిపోతల పథకాలు గతంలోనే పూర్తయ్యాయి. వీటితో ఏమాత్రం పోలికలేని విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద నిర్మిస్తున్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఆయనకు వచ్చిందే తడవుగా శాస్త్ర, సాంకేతిక-సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయించాక పని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాయలసీమలో అత్యధిక ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడమే కాకుండా, శతాబ్దాలుగా కరువువాత పడుతున్న వారిని శాశ్వతంగా ఆదుకునేందుకు సాధ్యమవుతుంది.

కృష్ణ లో నీళ్లున్నా సీమలో కరువు కన్నీళ్లు

 సువిశాలమైన రాయలసీమలో ఓ వైపున కృష్ణానది మరోవైపున తుంగభద్రతో పాటు వాటికి ఆనుకుని కర్నాటక నుంచి నెల్లూరు వరకు సీమ మీదుగా పెన్నా నది ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఎప్పుడూ తాగు, సాగు నీటికి కటకటే. స్వాతంత్య్రం రాక ముందు నిర్మించిన కెసి కాలువు ద్వారా నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల ఆయకట్టు కుదించుకుపోయింది.   తుంగభద్ర ఎగువ కాలువ కింద పిఎబిఆర్ తో పాటు చిత్రావతి లాంటి జలాశయాలు పూర్తయినప్పటికీ రాయలసీమ దశ-దిశలో ఏమాత్రం మార్పు రాలేదు. కరువు తాండవిస్తూనే ఉంది. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి వినియోగం పెంచేందుకు వైయస్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పటికీ ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంది.

వృథాగా సముద్రంలోకి వరద నీళ్లు

శ్రీశైలం నుంచి రాయలసీమకు తెలుగు గంగ (29 టిఎంసీలు), ఎస్.ఆర్.బి.సి (19), గాలేరు-నగరి-జిఎన్ఎస్ఎస్ (39), చెన్నైకి తాగు నీరు (15), టిబిపిహెచ్ ఎల్ సి (10), తాగు నీటి అవసరాలు- ఆవిరి నష్టాలు (3 టిఎంసీలు) కలిపి మొత్తం 114 టిఎంసీల నీటిని వినియోగించుకోవాలి.  గత సంవత్సరం 179.30 టిఎంసిల నీటిని రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నై నగరాలకు మళ్లించారు. అయినప్పటికీ సీమలో నీటి సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవైపు వరదల సమయంలో నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది.  శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని వినియోగించాల్సి ఉండగా గత రెండు సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన ఏ ఏడాది కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్ట్ లకు మళ్లించలేకపోయారు.  

సీమకు ప్రయోజనం లేని వరదలు

   క్రిష్ణా నదికి భారీ వరదలు వచ్చి శ్రీశైలం పొంగి ప్రవహించి జలాలు సముద్రంపాలు అయినప్పటికీ రాయలసీమ వాసులకు మాత్రం ప్రయోజనం లేకపోయింది. 2019-20 సంవత్సరంలో శ్రీశైలంకు 6 విడతల్లో (స్పెల్స్) వరదలు వచ్చాయి. 889 టిఎంసిల నీటిని స్పిల్ వే నుంచి కిందకు విడుదల చేశారు. అందులో 600 టిఎంసిల నీరు నిరుపయోగంగా సముద్రం పాలు అయ్యింది. అదే సమయంలో రాయలసీమలోని 4 జిల్లాలకు అవసరమైన నీరు అందలేదు. 120 టిఎంసిల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఈ నాలుగు జిల్లాలోనూ ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది.  వరద నీరు సైతం సీమ జిల్లాలకు అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు జలాశయంలో పూడిక పెరిగిపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయింది. వాస్తవానికి 308 టిఎంసిల జలాలు ప్రాజెక్ట్ నిండినప్పుడు ఉండాలి. కానీ 215 టిఎంసిలు మాత్రమే ఉంటోంది. అంటే దాదాపు 93 టిఎంసిల నీరు నిల్వ లేకుండా నిరుపయోగం అవుతోంది. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని మళ్లించుకోవడమే ఏకైక శరణ్యమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలంచారు. దాంతో ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనం చేసి ఆచరణలో సాధ్యమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

397 మెగావాట్ల భారీ పంపింగ్ కేంద్రం

రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్.ఎల్.సి– రాయలసీమ లిప్ట్ స్కీమ్) ద్వారా రోజు 3 టిఎంసిల (34722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణానది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి క్రిష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. జలాశయంలో 800 నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు మళ్లించే విధంగా నీటిని పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణానదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8 టిఎంసీల వరకు కూడా పంప్ చేసేందుకు ఉపయోగపడే విధంగా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది జగన్ ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తో పాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5 కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12 మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యుమెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసే విధంగా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి.

మొత్తం 397 మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరమవుతుంది. ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ ను వినియోగించి ఒక కేంద్రం నుంచి నీటిని పంపింగ్ చేయడం రాష్ర్టంలో ఇంతవరకు ఎక్కడా లేదు. ఏపిలో ఇదే అరుదైనది.. పెద్దది అవుతుంది. ఈ పంప్ హౌస్ పనిచేయాలంటే కనీస నీటిమట్టం 243 అడుగులు ఉండాలి. డెలివరీ లెవల్ 273 అడుగుల వద్ద ఉంటుంది.  ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముఖ్యంగా కొత్తకాలువ తవ్వడానికి 12 వేల ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు.